KCR: ఉన్న పరిశ్రమను కాపాడుకోలేమా?: టాలీవుడ్ పెద్దలకు భరోసా ఇచ్చిన సీఎం కేసీఆర్

  • ప్రగతి భవన్ లో సీఎంను కలిసిన చిరంజీవి, నాగార్జున తదితరులు
  • కరోనాతో ఇండస్ట్రీ నష్టపోయిందని సీఎంకు వివరణ
  • అందరం కలిసి ఇండస్ట్రీని కాపాడుకుందామన్న కేసీఆర్
Tollywood bigwigs met CM KCR

టాలీవుడ్ సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, ఫిలిం చాంబర్ అధ్యక్షుడు నారాయణ్ దాస్ నారంగ్, కార్యదర్శి కేఎల్ దామోదర ప్రసాద్ తదితరులు ఇవాళ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. కరోనా ప్రభావంతో సినీ పరిశ్రమ ఎలా నష్టపోయిందీ వారు సీఎం కేసీఆర్ కు వివరించారు. కరోనా వ్యాప్తి కారణంగా షూటింగులు, చిత్ర ప్రదర్శనలు నిలిచిపోయి ఇండస్ట్రీకి, కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. చిత్ర పరిశ్రమను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరారు.

సినీ పెద్దల విజ్ఞప్తికి సీఎం కేసీఆర్ నుంచి సానుకూల స్పందన వచ్చింది. రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని, అలాంటిది ఉన్న పరిశ్రమను కాపాడుకోలేమా? అని వ్యాఖ్యానించారు. కరోనాతో నష్టపోయిన చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం నుంచి రాయితీలు, మినహాయింపులు ఇస్తామని హామీ ఇచ్చారు. టాలీవుడ్ ను కష్టాల నుంచి గట్టెక్కించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

భారత్ లో ముంబయి, చెన్నై తర్వాత అంత పెద్ద సినీ పరిశ్రమ హైదరాబాదులోనే ఉందని, టాలీవుడ్ పై ఆధారపడి లక్షల మంది ఉపాధి పొందుతున్నారని వెల్లడించారు. కొవిడ్ ప్రభావంతో సినీ పరిశ్రమ దెబ్బతిన్న విషయాన్ని గుర్తించామని, ప్రభుత్వం, పరిశ్రమ పెద్దలు కలసికట్టుగా ప్రయత్నించి ఇండస్ట్రీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలోనూ సినీ పరిశ్రమ అంశాలను ప్రస్తావిస్తామని తెలిపారు. కాగా, సినీ పరిశ్రమ పరిస్థితులపై చర్చించేందుకు మరికొన్నిరోజుల్లో చిరంజీవి ఇంట్లో సమావేశమవ్వాలని ప్రముఖులు నిర్ణయించారు.

More Telugu News