cm: ముఖ్యమంత్రి జగన్ సిగ్గుపడాలి.. సచివాలయానికి ‘ఆక్టోపస్’ను పెట్టుకుని వెళ్లాడు: చంద్రబాబునాయుడు
- తన ప్రాణానికి, భద్రతకే ముప్పు వచ్చిందని జగన్ ఆలోచించాడు
- ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది?
- ఉన్మాద చర్యలు చేపడితే మీరు పారిపోక తప్పదు
ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు పదిరోజులుగా నిరసనలు చేస్తున్నారని, వారికి మద్దతుగా రాజకీయపార్టీలు నిలిచాయని.. సమస్య అర్థం కావట్లేదా? మీకు ఏ భాషలో చెప్పాలి? అంటూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజధాని ప్రాంతంలో ఎక్కడ చూసినా ఆందోళనలు, బాధలు, ఆక్రందనలు ఉన్నాయని, ఎలా బతకాలని రైతులు ఆవేదన చెందుతున్నారని అన్నారు.
జీఎన్ రావు నిపుణుల కమిటీ నివేదికపై సచివాలయంలో నిర్వహించిన కేబినెట్ సమావేశానికి సీఎం జగన్ భారీ భద్రతతో వెళ్లడంపై విమర్శలు చేశారు. ‘ఈరోజున ముఖ్యమంత్రి సిగ్గుపడాలి. ‘ఆక్టోపస్’ను పెట్టుకుని వెళ్లాడు. ముందుగా, రెండు వెహికల్స్ ను ట్రయల్స్ కు పంపించాడు. నీ(జగన్) ప్రాణానికి, నీ భద్రతకే ముప్పు వచ్చిందని ఆలోచించినప్పుడు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? జగన్ నివాసం వద్ద 144 సెక్షన్ పెట్టారు. ప్రజాదర్బార్ కూడా కేన్సిల్ చేసుకున్నాడు’ అంటూ విమర్శించారు. ఉన్మాద చర్యలు చేపడితే ప్రజలు తిరుగుబాటు చేస్తే మీరు పారిపోక తప్పదు అని జగన్ ని హెచ్చరించారు.