KA Paul: జగన్ కు ప్రత్యేక హోదా కేసీఆర్, మోదీ ఇస్తారు.. తీసుకోమనండి!: కేఏ పాల్ విసుర్లు
- పాల్ లైవ్ స్ట్రీమింగ్
- జగన్ నవరత్నాలు పంచుతాడో లేదో చూస్తానంటూ కామెంట్
- అభివృద్ధి కావాలంటే తనను అడగాలంటూ సూచన
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ మతప్రబోధకుడు కేఏ పాల్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా అభిమానులకు అందుబాటులోకి వచ్చారు. ఈ సందర్భంగా ఏపీ కాబోయే సీఎం జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నవరత్నాలు పేరిట హామీ ఇచ్చిన జగన్ ఈ నెల 30 నుంచి అన్నీ పంచుతానని చెబుతున్నాడని, పంచుతాడో లేదో చూస్తానని అన్నారు. జగన్ మాట నిలబెట్టుకుంటాడనే ఆశిస్తున్నానని కేఏ పాల్ తెలిపారు. ఓ నెటిజన్ జగన్ కు సపోర్ట్ చేయండి అని కోరగా, ఆ మాట అడగాల్సింది జగన్ అని, జగన్ అడిగితే ఎందుకు సపోర్ట్ చేయను? అంటూ తిరిగి ప్రశ్నించారు.
జగన్ కు దైవప్రార్థన అవసరమైతే ఆయనే అడగాలి, జగన్ కు అభివృద్ధి అవసరమైతే ఆయనే అడగాలి, మరి ఆయన అడుగుతాడా? నువ్వు అడుగుతావా? అంటూ ఆ నెటిజన్ మరో ప్రశ్న అడగకుండా పాల్ తన వాగ్ధాటిని ప్రదర్శించారు. జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ కేసీఆర్ ను సపోర్ట్ అడిగారు, కేసీఆర్ ను ఇమ్మనండి స్పెషల్ స్టేటస్! మోదీని కూడా వెళ్లి కలిశాడు, మోదీ స్పెషల్ స్టేటస్ ఇస్తాడు తీసుకోమను అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.
వందల మంది దేశాధినేతలతో పరిచయాలు కావాలన్నా, బిలియనీర్లు రావాలన్నా తనను సపోర్ట్ అడగాలని కేఏ పాల్ ఈ సందర్భంగా జగన్ కు సూచించారు. జగన్ అడగనిదే తానేం చేయగలనని పాల్ వ్యాఖ్యానించారు. మరో ప్రశ్నకు సమాధానంగా, జగన్ తనను ప్రమాణస్వీకారానికి పిలవలేదని, పిలిస్తే ఎందుకు రాను? అని బదులిచ్చారు.