Chandrababu: జగన్ మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా: చంద్రబాబు

  • ప్రజల తీర్పును ఆమోదిస్తున్నాం
  • ఫలితాలను గౌరవించడం అందరి బాధ్యత
  • నివేదికలు వచ్చిన తర్వాతే మాట్లాడతా

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితమే ఏపీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ కు పంపిన అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏపీలో ఎన్నికలు ముగిశాయని, కౌంటింగ్ కూడా పూర్తయిందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును ఆమోదిస్తున్నామని, ఈ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన దరిమిలా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పారు.

కేంద్రంలో నరేంద్ర మోదీ, బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నట్టు అన్నారు. పక్క రాష్ట్రం ఒడిశాలో కూడా నవీన్ పట్నాయక్ విజయం సాధించడం పట్ల ఆయనకు కూడా శుభాభినందనలు తెలుపుతున్నట్టు చెప్పారు. ఇక అహోరాత్రులు శ్రమించి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. పార్టీ కోసం ఓట్లేసిన ప్రజలకు, పార్టీ కోసం ఆలోచించిన శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చంద్రబాబు మీడియా ముఖంగా చెప్పారు.

ఈ ఎన్నికల ఫలితాలను సమీక్షించి ఏం చేయాలన్న దానిపై ప్రజలకు తెలియజేస్తామని, భవిష్యత్తులో పార్టీ ఎలా ముందుకు పోవాలన్నదానిపైనా సమీక్ష నిర్వహిస్తామని అన్నారు. ఫలితాలు వచ్చాయి కాబట్టి ఇప్పుడేమీ నిర్ణయాలు తీసుకోలేనని, ఫలితాలను గౌరవించడం ప్రజాస్వామ్యంలో అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. లోపాలు ఎక్కడ జరిగాయన్నదానిపై నివేదికలు వచ్చిన తర్వాతే మాట్లాడతానని వెల్లడించారు.

  • Loading...

More Telugu News