KCR: ఈ ఆరు పనులు చేస్తే నేను కూడా జగన్ వైపే: చంద్రబాబు

  • కేసీఆర్ తో మాట్లాడి అడ్డంకులు లేకుండా చూడాలి
  • హోదాపై కేసీఆర్ తో లేఖ రాయించాలి
  • ప్రజలు జగన్ ను నిలదీయాలన్న చంద్రబాబు

తన పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని, తనను ముఖ్యమంత్రిని చేయాలని వేడుకుంటున్న వైఎస్ జగన్ కు దమ్ముంటే, ఈ ఆరు పనులు చేసి చూపాలని, అప్పుడు తాను కూడా జగన్ వెంట నిలుస్తానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సవాల్ విసిరారు. ఎలక్షన్ మిషన్ 2019పై టీడీపీ కార్యకర్తలు, నేతలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు, కేసీఆర్, జగన్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. జగన్ ను ప్రజలంతా ఈ ఆరు ప్రశ్నలపై నిలదీయాలని, ఇవి చేసి చూపించాలని అడగాలని కోరారు.

 అవి...
1. ప్రత్యేక హోదాపై కేసీఆర్ తో బహిరంగ ప్రకటన చేయించాలి.
2. ఏపీకి హోదా ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాయించాలి.
3. కేసీఆర్ తో మాట్లాడి పోలవరంపై ఉన్న కేసులను ఎత్తివేయించాలి.
4. శ్రీశైలం, సాగర్ లోని కృష్ణా నీటిపై హక్కులను అడగబోమని చెప్పించాలి.
5. షెడ్యూల్ 9, 10 సంస్థల ఆస్తుల్లో ఏపీ వాటాను కేసీఆర్ తో ఇప్పించాలి.
6. రాజధాని, పోలవరంపై అవాస్తవాలు చెప్పినట్టు ఒప్పుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఎన్నికల యుద్ధానికి ఇంకా రెండు రోజులే మిగిలివుందని, ఈ రెండు రోజులూ మరింత జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీడీపీ శ్రేణులంతా సైనికుల్లా పోరాడాలని కోరారు. ఈవీఎంలపై ఓటర్లలో అవగాహన పెంచాలని, ఎక్కడ టీడీపీ అభ్యర్థి పేరు, సైకిల్ గుర్తు ఉంటుందో వారికి నమూనా బ్యాలెట్ పేపర్ ద్వారా ముందే చెప్పాలని సూచించారు. టీడీపీకి అండగా ఉండే వివిధ వర్గాలపై బీజేపీ, వైసీపీలు దాడులు చేయిస్తున్నాయని, వాటిని ఎదుర్కోవాలని అన్నారు. ఏపీకి ఎక్కడ అన్యాయం జరిగిందని అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన చంద్రబాబు, అన్నింటిలోనూ బీజేపీ అన్యాయమే చేసిందని, న్యాయం అన్న పదాన్ని ఉచ్చరించే అర్హత కూడా అమిత్ షాకు లేదని విమర్శలు గుప్పించారు.

  • Loading...

More Telugu News