Chandrababu: బీజేపీతో జగన్ లాలూచీకి కేంద్రమంత్రి అథవాలే వ్యాఖ్యలే నిదర్శనం: చంద్రబాబు
- కేసులు చూపించి జగన్‌ని బీజేపీ లొంగదీసుకుంది
- ఎన్నికల తర్వాత ఆ పార్టీని బీజేపీలో కలిపేస్తాడు
- దేశంలో నేరగాళ్లంతా ఏకమయ్యారు
భారతీయ జనతా పార్టీతో వైసీపీకి ఉన్న లాలూచీని కేంద్ర మంత్రి అథవాలే చెప్పకనే చెప్పారని, ఎన్నికల అనంతరం వైసీపీని జగన్ బీజేపీలో విలీనం చేయడం ఖాయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దేశంలోని నేరగాళ్లంతా ఒకే గూటికి చేరనున్నారనేందుకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. కేసుల బూచిని చూపించి జగన్‌ని బీజేపీ లొంగదీసుకుందని, ఎన్నికల అనంతరం ఎన్డీయేలోకి జగన్ వస్తారని అథవాలే అందుకే అంతధైర్యంగా చెప్పగలిగారని ఆరోపించారు.
కేసుల నుంచి బయటపడేందుకు వైసీపీని మోదీకి తాకట్టుపెట్టాడని, హైదరాబాద్‌లో ఆస్తులు రక్షించుకునేందుకు కేసీఆర్‌కు వైసీపీని అమ్మేశాడని తీవ్రస్థాయిలో ఆరోపించారు. అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో బ్రాహ్మణీ స్టీల్స్‌కు శంకుస్థాపన చేస్తాననడం చూస్తే మళ్లీ గాలి జనార్దనరెడ్డికి ఇనుప ఖనిజాన్ని అమ్మేస్తాడని అర్థమయిందని ఆరోపించారు. తోడు దొంగలైన జగన్, గాలి జనార్దనరెడ్డికి మోదీ, అమిత్‌షాలు రక్షణగా నిలుస్తున్నారని ధ్వజమెత్తారు. లోపాయికారీ ఒప్పందాల వల్లే మోదీ సభకు వైసీపీ జనాలను తరలిస్తున్నారని ఆరోపించారు.