Chandrababu: వెయ్యి కోట్లతో ముగ్గురూ కలిసి కుట్రలు.. చంద్రబాబు సంచలన ఆరోపణ

  • అభివృద్ధిని కాంక్షించేవారు టీడీపీలో చేరుతున్నారు
  • ఆంధ్రోళ్లంతా రాక్షసులే అన్న కేసీఆర్.. జగన్‌తో దోస్తీ చేస్తున్నారు
  • రాష్ట్రంలో సామంతరాజు వ్యవస్థను తీసుకురావాలని చూస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మోదీ, జగన్, కేసీఆర్‌లపై మరోమారు విరుచుకుపడ్డారు. వీరు ముగ్గురూ కలిసి వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీతో కుట్రలు ప్రారంభించారని ఆరోపించారు. రాష్ట్రంలో సామంతరాజు వ్యవస్థను తీసుకురావాలన్నదే వీరి ఉద్దేశమని మండిపడ్డారు. ఏపీ అంటే ద్వేషంతో ఊగిపోయే కేసీఆర్, కేటీఆర్‌లు జగన్‌పై మాత్రం ప్రేమ ఒలకబోస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని మరో బీహార్ చేయాలని ప్రశాంత్ కిశోర్‌తో కలిసి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వీరందరికీ గుణపాఠం తప్పదని చంద్రబాబు హెచ్చరించారు.

కుల రాజకీయాలను అందరూ వెలివేయాలని సూచించిన చంద్రబాబు.. టీడీపీతోనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్రాభివృద్ధిని, మంచిని కోరుకునేవారు టీడీపీలో చేరుతున్నారని.. అవినీతిని కాంక్షించేవారు వైసీపీవైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఏడు పార్లమెంటు నియోజకవర్గాల్లో సమీక్షలు పూర్తయ్యాయన్న చంద్రబాబు  గెలుపు గుర్రాలనే బరిలోకి దించనున్నట్టు చెప్పారు. అలాగే, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంటుందన్నారు.

ఏపీలో పెత్తనం చేయాలని కేసీఆర్ చూస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఒకప్పుడు తాము పశువులకు వేసే ఉలవలను ఆంధ్రోళ్లు చారు చేసుకుని తింటారని గతంలో ఆయన ఎద్దేవా చేశారని గుర్తు చేశారు. ఆంధ్రావాళ్లంతా రాక్షసులే అన్న కేసీఆర్ ఇప్పుడు జగన్‌తో దోస్తీ కట్టారని విమర్శించారు. పోలవరంపై తన కుమార్తెతో కేసులు వేయిస్తున్న కేసీఆర్.. వైసీపీకి డబ్బు మూటలు అందిస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. జగన్-కేసీఆర్ దోస్తీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, టీఆర్ఎస్‌కు వంతపాడే వైసీపీకి తగిన గుణపాఠం చెప్పాలని చంద్రబాబు నేతలతో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News