Crime News: టాస్క్‌ఫోర్స్‌ పోలీసులమని చెప్పి యువతి పట్ల అసభ్య ప్రవర్తన : డబ్బు, నగలు దోపిడీ

  • కొట్టి, చంపుతామని బెదిరించినట్లు పోలీసులకు ఫిర్యాదు
  • బాధితురాలు ఢిల్లీలోని షాలిమార్‌బాగ్‌ వాసి
  • ఫిలింనగర్‌ ప్రాంతంలోని ఓ హోటల్లో ఘటన

టాస్క్‌ఫోర్స్‌ పోలీసులమంటూ తన హోటల్‌ గదిలోకి ప్రవేశించడమేకాక, తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని, కొట్టి, చంపుతామని బెదిరించి తన వద్ద ఉన్న నగదు, బంగారం ఎత్తుకెళ్లారని ఢిల్లీకి చెందిన ఓ యువతి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం మేరకు ఢిల్లీలోని షాలిమార్‌బాగ్‌ ప్రాంతానికి చెందిన ఓ యువతి (22) ముంబయిలో ఉంటోంది. నగరానికి చెందిన మోహిత్‌ అనే వ్యక్తి ఈమెకు ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆమె ఈనెల 22న నగరానికి వచ్చి ఫిలింనగర్‌లోని ఓ హోటల్‌లో బస చేసింది. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆమె గదికి వచ్చి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులుగా పరిచయం చేసుకున్నారు.

తీవ్రంగా కొట్టి అసభ్యంగా ప్రవర్తించారు. చంపేస్తామని బెదిరించి రూ.30వేల నగదు, బంగారం గొలుసు, రింగు తీసుకున్నారు. బలవంతంగా ఆమె అకౌంట్‌ నుంచి మరో రూ.70 వేలు డ్రా చేయించి తీసుకున్నారు. అనంతరం ఆమెను విమానాశ్రయం వద్ద వదిలేసి హైదరాబాద్‌ వదిలి వెళ్లాలని, లేదంటే ఉన్నతాధికారులు వచ్చి అరెస్టు చేస్తారని బెదిరించారు. అయితే బాధితురాలు నగరంలోని మరో ప్రాంతంలో తలదాచుకుని శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా పుటేజీ పరిశీలించారు. దౌర్జన్యం చేశారని ఆరోపించిన వ్యక్తులతో ఆమె మామూలుగానే వెళ్లినట్లు గుర్తించారు. దీంతో ఈ ఘటన వెనుక వేరొక కారణం ఏదైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News