Pawan Kalyan: సీఎం గారూ.. ‘పోలవరం’ నిర్వాసితుల కష్టాలపై సమీక్షించే తీరిక లేదా?: పవన్ కల్యాణ్

  • ఏటేటా కాంట్రాక్టర్లకు మాత్రం రేట్లు పెంచుతారు
  • పరిహారం, పునరావాసం సంగతి పట్టించుకోరు
  • ఇప్పటికి పూర్తి చేసిన పునరావాసం నాలుగు శాతమే

పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసి నిర్వాసితులైనవారికి ఆంధ్ర ప్రజలందరూ రుణపడి ఉండాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఎన్నో తరాలుగా ఉన్న ఊరినీ, ఉంటున్న ఇంటినీ, దున్నుకొనే పొలాన్నీ.. తమ జీవనాన్ని జాతి ప్రయోజనాల కోసం త్యాగం చేసిన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్ని ఆదుకోవాల్సిన సర్కార్ ఆ బాధ్యతను విస్మరించిందన్నారు. ప్రతి ఏటా రివ్యూ చేసి మరీ కాంట్రాక్టర్లకు రేట్లు పెంచే ముఖ్యమంత్రి పోలవరం నిర్వాసితుల విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈరోజు ఉదయం పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల ప్రజలతో ఆయన సమావేశమయ్యారు.

కుక్కునూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రాజెక్టు నిర్వాసితులు, గిరిజనులు తమ కష్టాలను వివరించారు. తెలంగాణ నుంచి కలిపిన ఈ మండలాల్లో కనీసం విద్య, వైద్య సదుపాయాలు కల్పించలేదని వాపోయారు. కనీస మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.

అనంతరం కుక్కునూరులో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తూ, ‘రోజూ సచివాలయం నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంతవరకూ వచ్చిందో అడిగి తెలుసుకునే ముఖ్యమంత్రికి ఆ ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్ళు త్యాగం చేసిన ప్రజల ఇబ్బందులు ఏమైనా తెలుసా? కాంట్రాక్టర్లకు రేట్లు పెంచడం మీద ఉన్న శ్రద్ధ నిర్వాసితులపై ఏ మాత్రం లేదు. భూములు కోల్పోతున్నవారికి 2013 భూ సేకరణ చట్టం మేరకు పరిహారం ఇవ్వాలి. కాంట్రాక్టర్లకు ఏటా రేట్లు పెంచుతారు గానీ, నిర్వాసితులకు ఎందుకు న్యాయమైన పరిహారం ఇవ్వరు? ఉన్న ఊళ్లను వదిలి వచ్చేస్తున్నా వారికి సరైన ఇళ్ళు కూడా ఇవ్వలేదు. ఇప్పటికీ నాలుగు శాతం మాత్రమే పునరావాసం పూర్తయిందంటే అర్థమవుతోంది ఈ సర్కారుకి ఈ ప్రజల మీద ఎంత శ్రద్ధ ఉందో.

సీఎం గారూ... పోలవరం నిర్వాసితులకు న్యాయంగా చేయాల్సిన పునరావాసం, చెల్లించాల్సిన పరిహారం ఏ విధంగా ఇస్తున్నారో సమీక్షించేందుకు మీకు టైం కూడా ఉండటం లేదా? ఒక్క సెకన్ వారి గురించి ఆలోచించలేరా? పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కష్టాలను ముఖ్యమంత్రి, అధికారులు అర్థం చేసుకోవాలి. ఇక్కడి ప్రజలకి కనీస విద్య, వైద్య సదుపాయాలూ కూడా కల్పించడం లేదు.

జిల్లా కలెక్టర్ గారికి చెబుతున్నా... ఈ ప్రాంతాలకు వచ్చి ప్రజల కష్టాలు తెలుసుకోండి. ఇక్కడి వారికి కనీసం బస్సు పాస్ కూడా ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కలిసిపోయారని తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు పాస్ ఇవ్వరు. ఇంకా ఎలాంటి ఆర్డర్స్ లేవని ఆంధ్ర ప్రదేశ్ ఆర్టీసీ వాళ్ళు ఇవ్వరు. భూములు, ఇళ్లతోపాటు ఆర్టీసీ పాస్ లు కూడా త్యాగం చేశారు ఇక్కడి ప్రజలు.

దేశంలో భాక్రానంగల్ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటి పోలవరం ప్రాజెక్టు వరకూ ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టులో భూములు, ఆస్తులు కోల్పోయిన ప్రజల గురించి ఎవరూ పట్టించుకోలేదు. వంశధార, చింతలపూడి భూ నిర్వాసితుల కష్టాలూ అలాగే ఉన్నాయి. వీటి గురించి మాట్లాడితే నేనేదో ప్రాజెక్టుకి వ్యతిరేకం, అభివృద్ధికి వ్యతిరేకం అని టీడీపీ ప్రచారం చేస్తోంది. నేను అభివృద్ధికి వ్యతిరేకం కాదు... ఆ అభివృద్ధి కోసం భూములు, ఆస్తులు కోల్పోయిన వారికి న్యాయం చేయాలంటున్నా’ అని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

అవి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లా?

‘2013 భూసేకరణ చట్టాన్ని వదిలి ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి చట్టం ప్రకారం పరిహారం ఇస్తామనడం దారుణం. పోలవరం ప్రాజెక్టులో రూ. 33 వేల కోట్లు పరిహారం, పునరావాసం కోసమే కేటాయించారు. ఇప్పటికి కేవలం నాలుగు శాతం మేరకే పునరావాసం ఇచ్చారు. మిగిలిన వారికి ఎప్పుడు పూర్తి చేస్తారు? 2019 నాటికి పోలవరం పూర్తవుతుందని ముఖ్యమంత్రి చెబుతున్నారు. పునరావాసం పూర్తి చేయకుండా ప్రాజెక్టు ఎలా పూర్తి చేసినట్లవుతుంది? నిర్వాసితుల కన్నీళ్ల మీద ఎలా పూర్తవుతుంది? నిర్వాసితులకు సరైన ఇళ్ళు కూడా కట్టించడం లేదు. ఒక గదిని రెండుగా చేసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు అంటే ఎలా? ఈ ప్రాజెక్టు మూలంగా ఎందరో గిరిజనులు తమ జీవన విధానాన్ని, సంస్కృతీ సంప్రదాయాలను వదులుకునే పరిస్థితి వచ్చింది. వారి గురించీ ప్రభుత్వం ఆలోచించాలి. ఈ ప్రాంతంలోని ఎస్సీ, బీసీ, పేద అగ్రవర్ణాల కోసం తగిన ప్రణాళికలతో ఆలోచనలు చేయాలి’ అని పవన్ సూచించారు.
 
‘జనసేన’ అండగా నిలుస్తుంది

జాతి ప్రయోజనాల కోసం సర్వం వదులుకొంటున్న నిర్వాసితుల పట్ల ఆంధ్ర ప్రజలందరూ బాధ్యతతో ఉండాలి. చివరి నిర్వాసితుడికీ న్యాయమైన పరిహారం, పునరావాసం, కనీస సౌకర్యాలతో కూడిన జీవితం వచ్చే వరకూ అండగా నిలవాలి. ఈ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకూ జనసేన అండనిచ్చి పోరాటం చేస్తుంది. తెలంగాణ నుంచి కలిసిన మండలాల్లోని మున్నూరు కాపు కులాన్ని ఇక్కడ బీసీగా గుర్తించడం లేదని చెబుతున్నారు. ఇదే తరహా సమస్య తెలంగాణలోనూ ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లో బీసీ కులాలు కొన్నింటిని తెలంగాణాలో గుర్తించడం లేదు. దీనిపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకొని తగిన న్యాయం చేయాలి. వీరి కోసం జనసేన జాతీయ బీసీ కమిషన్ కి విజ్ఞాపన ఇస్తుంది’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

అశ్వారావుపేటలో కోలాహలం

పోలవరం ముంపు గ్రామాల ప్రజల్ని కలిసేందుకు పవన్ కల్యాణ్ వెళ్తున్న సమయంలో మార్గ మధ్యంలో తెలంగాణ ప్రాంతంలోని అశ్వారావుపేటలో ఆయనకు జన సైనికులు ఘన స్వాగతం పలికారు. ఆ ప్రాంతం కోలాహలంగా మారింది. తెలంగాణ ఎన్నికల్లో జనసేన బరిలోకి దిగాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ మేరకు తెలంగాణ జనసేన కార్యకర్తలు పవన్ కి వినతి పత్రం సమర్పించారు.   

  • Loading...

More Telugu News