Pawan Kalyan: అధికార, ప్రతిపక్ష నేతల మాదిరి నా నోటికొచ్చింది చెప్పేసి తప్పించుకోను: పవన్ కల్యాణ్

  • ఇచ్చిన హామీ నెరవేర్చని పక్షంలో వివరణ ఇచ్చుకోవాలి
  • రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకురావడమే లక్ష్యం
  • ఉన్న సంపదంతా కొద్దిమంది చేతుల్లోకి వెళ్లిపోతోంది

అధికార, ప్రతిపక్ష నేతల మాదిరి తన నోటికొచ్చింది చెప్పేసి ఆ తర్వాత తప్పించుకునేవాడిని కాదని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని క్రాంతి కల్యాణ వేదికలో ఏపీ కో-ఆపరేటివ్ సొసైటీ ఉద్యోగులు, ‘మీ సేవ’ నిర్వాహకులతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. వివిధ వర్గాల ప్రతినిధులు తమ సమస్యలను ఆయనకు విన్నవించుకున్నారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఇచ్చిన హామీ నెరవేర్చని పక్షంలో వివరణ ఇచ్చుకోవాలని, రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకురావడమే తన లక్ష్యమని అన్నారు. ఉన్న సంపదంతా కొద్దిమంది చేతుల్లోకి వెళ్లిపోతోందని, ఆ సంపదను అందరికీ పంచడమే జనసేన పార్టీ ఉద్దేశమని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి అధికారంలోకొస్తే, మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు ఐదు లక్షల బీమా, ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని పవన్ హామీ ఇచ్చారు. సహకార సంఘ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, అయితే, వారి సమస్యలు అర్థం చేసుకోవడానికి కొంత వ్యవధి కావాలని, వారి నుంచి నేరుగా సమస్యలు విని, అర్థం చేసుకుంటే వాటిని మేనిఫెస్టోలో ఎలా చేర్చాలన్న అంశాన్ని ముందుకు తీసుకెళ్లడం తేలికవుతుందని అన్నారు. జనసేన పార్టీని చాలా ప్రతికూల పరిస్థితుల్లో స్థాపించానని, ప్రస్తుత రాజకీయాలు అవకాశవాదంతో నిండిపోయాయని విమర్శించారు.

రాజకీయ పార్టీ నడవాలంటే వేల కోట్లు అవసరమని, అయితే, తన వద్ద వేలకోట్లు లేకపోయినా, కోట్లాది మందికి సేవ చేయాలన్న బలమైన సంకల్పం మాత్రం ఉందని అన్నారు. మేనిఫెస్టోలో రైతు సమస్యలు ఎందుకు చేర్చలేదని అడుగుతున్నారని, సమగ్ర అధ్యయనం తర్వాత ప్రతి రైతుకీ మేలు జరిగేలా తమ పథకాలు ఉంటాయని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. రైతు కన్నీరుపెట్టకుండా ఉండాలంటే, ముందు, సహకార సంఘ ఉద్యోగులకు న్యాయం చేయాలని, ఎన్ని సీట్లిచ్చి చట్టసభలకు పంపినా ప్రజల తరపున పోరాటం చేస్తానని, తమ ప్రభుత్వం వస్తే ప్రతిఒక్కరి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని పవన్ హామీ ఇచ్చారు.

ప్రతి 30 కిలోమీటర్లకు ఓ ఏరియా ఆసుపత్రి ఉండేలా చూస్తాం

ఏలూరు ఆశ్రమ ఆసుపత్రి వైద్యులతో పవన్ సమావేశమయ్యారు. సాటి మనిషి బాధ చూడలేకే రాజకీయాల్లోకి వచ్చాను తప్ప, ఎవరో బలవంతపెడితే రాలేదని పవన్ కల్యాణ్ అన్నారు. జనరిక్ మందులపై ప్రజల్లో అవగాహన కల్పించి, మ్యానిఫ్యాక్చర్ యూనిట్లను స్థానికంగా ఏర్పాటు చేసేలా ‘జనసేన’ కృషి చేస్తుందని, ప్రతి 30 కిలోమీటర్లకు ఓ ఏరియా ఆసుపత్రి ఉండేలా చర్యలు తీసుకుంటామని పవన్ హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News