Chandrababu: 2,3 తేదీల్లో ఢిల్లీకి చంద్రబాబు.. వద్దంటున్న సీనియర్లు

  • ఢిల్లీలో వివిధ పార్టీల నేతలను కలవనున్న చంద్రబాబు
  • ఈ సమయంలో వెళ్లడం సరికాదంటున్న నేతలు
  • ప్రతిపక్ష ఎంపీలకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న పుస్తకాలు

రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేంద్రంతో పోరాటానికి  సిద్ధమైన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 2,3 తేదీల్లో ఢిల్లీలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకోగా, సీనియర్లు మాత్రం వద్దని వారిస్తున్నారు. మరోసారి ఆలోచించమని చెబుతున్నారు. ఢిల్లీలో వివిధ పార్టీల నేతలను కలిసి రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని వివరించాలని చంద్రబాబు నిర్ణయించారు.

ఇందుకోసం ప్రజెంటేషన్ పుస్తకాలను కూడా తయారు చేసుకున్నారు. ఎంపీలకు అందించేందుకు ప్రత్యేకంగా మరో పుస్తకాన్ని తయారుచేశారు. ఈ పుస్తకంలో విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, అమలు తీరు తదితర వాటిని సమగ్రంగా పొందుపరుస్తున్నారు. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చిన పార్టీ నేతలను, ఎంపీలను కలిసి కృతజ్ఞతలు చెప్పి ఈ పుస్తకాలు ఇవ్వాలన్నది చంద్రబాబు యోచన.  

ప్రతిపక్ష పార్టీ నేతలను కలవడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని చంద్రబాబు యోచిస్తుండగా కొందరు సీనియర్లు మాత్రం చంద్రబాబు ఢిల్లీ వెళ్లకపోవడమే మంచిదని చెబుతున్నారు. ప్రస్తుతం తృతీయ ఫ్రంట్‌పై చర్చ కొనసాగుతున్న సమయంలో చంద్రబాబు ఢిల్లీ  వెళ్తే ఈ చర్చకు మరింత ఊపు వస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ఇటువంటి చర్చలు అవసరం లేదని, కాబట్టి కొంతకాలం ఆగితే మంచిదని సీఎంకు సూచించినట్టు తెలుస్తోంది. అవిశ్వాసం చర్చకు వచ్చే అవకాశం ఎలాగూ లేదని, టీడీపీ ఎంపీలు బాగానే పనిచేస్తుండడంతో ప్రస్తుతానికి అది సరిపోతుందని అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు చంద్రబాబు పర్యటన ఇప్పటికే ఖరారు కావడంతో ఆగే పరిస్థితి లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు ఢిల్లీ వెళ్లడం ద్వారా ఏపీ హోదా అంశం జాతీయ స్థాయిలో చర్చకు వస్తుందని చెబుతున్నారు. ఫలితంగా కొంత మేలు జరిగే అవకాశం ఉందంటున్నారు.

  • Loading...

More Telugu News