Rahul Gandhi: ఇక బీజేపీకి చుక్కలే.. మోదీ హవాను ఎదురొడ్డే నాయకుడు వచ్చేశాడు: కాంగ్రెస్ సంబరం!

  • వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తథ్యం
  • బీజేపీ గెలిచినా మోదీ ప్రధాని కాలేరు
  •  ఉప ఎన్నికల్లో బీజేపీకి చుక్కలు చూపిస్తున్న కాంగ్రెస్
  • రాజస్థాన్‌లో బీజేపీ నుంచి మూడు సిట్టింగ్ స్థానాలు లాగేసుకున్న కాంగ్రెస్
  • తేల్చి చెబుతున్న కాంగ్రెస్ వర్గాలు

మోదీ హవాకు బ్రేకులు వేసే నాయకుడు వచ్చేశాడని కాంగ్రెస్ నేతలు తెగ సంబరపడిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఇక చుక్కలే కనిపిస్తాయని అంటున్నారు. మోదీ హవాను అడ్డుకునే శక్తి ఒక్క రాహుల్ గాంధీకే ఉందని చెబుతున్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హరియాణా, జార్ఖండ్, చత్తీస్‌గఢ్‌లలో జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలే అందుకు నిదర్శనమని చెబుతున్నారు.

బీజేపీ నుంచి ఈసారి మరో 60 సీట్లను కాంగ్రెస్ లాగేసుకుంటుందని, దీంతో ప్రధానిగా రెండోమారు కొనసాగాలని ఉవ్విళ్లూరుతున్న మోదీ కల  నెరవేరదని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత ఒకరు చెప్పారు. మిత్రపక్షాలతో కలిసి పనిచేయడం మోదీకి రాదని, ఆయన తీరుతో మిత్రపక్షాలు ఎన్డీఏలో ఇమడలేకపోతున్నాయని పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో రెండు  మార్పులు స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. యూపీఏ అధికారంలోకి రావడం ఖాయమని, లేదంటే, ఒకవేళ బీజేపీ వచ్చినా మోదీ మాత్రం ప్రధానిగా ఉండే అవకాశం లేదని ఆయన వివరించారు. మిత్రపక్షాలు ఈసారి మోదీని అంగీకరించే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం శివసేన, అకాలీదళ్, టీడీపీలు మోదీ తీరుపై గుర్రుగా ఉన్నాయని, మున్ముందు మరిన్ని పార్టీలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఆయన వివరించారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ 220 సీట్లకు పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. గత ఎన్నికల్లో కాషాయ పార్టీకి 282 సీట్లు వచ్చాయి. మోదీ లాంటి వ్యక్తి కూటములకు సరిపోడని, రాజ్‌నాథ్ లాంటి వారు అయితే సరిగ్గా సరిపోతారని అంటున్నారు.

ఇక, గుజరాత్ ఎన్నికల్లో బీజేపీతో కాంగ్రెస్ హోరాహోరీగా తలపడి, ముచ్చెమటలు పట్టించడం, ఇటీవలి రాజస్థాన్ ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి మూడు సిట్టింగ్ స్థానాలను లాక్కోవడం చూస్తుంటే ప్రజలు బీజేపీ నుంచి క్రమంగా కాంగ్రెస్ వైపు మళ్లుతున్నట్టు అర్థమవుతోందని కాంగ్రెస్ ఆశాభావం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News