Telangana: తెలంగాణలో అనుమ‌తి లేని లే-అవుట్ల‌లోని ప్లాట్ల‌కు నో రిజిస్ట్రేష‌న్‌?

  • నూత‌న పంచాయ‌తీరాజ్ చ‌ట్టంపై స‌బ్ కమిటీ సుదీర్ఘ చ‌ర్చ‌
  • మూడోరోజు చ‌ర్చ‌లో పలు అంశాల ప్ర‌స్తావ‌న‌
  • ప్ర‌త్యేకంగా హాజ‌రైన డిప్యూటీ సీఎం మ‌హ‌మూద్ అలీ

తెలంగాణ లో నూత‌న పంచాయ‌తీరాజ్ చ‌ట్టంపై మంత్రుల స‌బ్ కమిటీ వరుసగా మూడో రోజు చర్చలు జరిపింది. మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అధ్య‌క్ష‌త‌న దాదాపు ఎనిమిది గంట‌ల పాటు అనేక అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించింది. స‌బ్ క‌మిటీ స‌భ్యులైన మంత్రులు తుమ్మ‌ల నాగేశ్వ‌రరావు, పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డి, ఈటల రాజేంద‌ర్ తో పాటు జ‌గ‌దీశ్ రెడ్డి కూడా ఈ చ‌ర్చ‌లో పాల్గొన్నారు. అనుమ‌తి లేని లే అవుట్ల‌లో ప్లాట్ల రిజిస్ట్రేష‌న్‌ను ఆపి వేస్తే ఎలా ఉంటుంద‌న్న అంశంపై సంబంధిత శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మ‌హ‌మూద్ అలీతోనూ స‌బ్ క‌మిటీ ప్ర‌త్యేకంగా చ‌ర్చించింది.

ఎలాంటి అనుమ‌తి లేకుండా లే అవుట్లు చేస్తూ విచ్చ‌ల‌విడిగా ప్లాట్ల‌ను రిజిస్ట్రేష‌న్లు చేస్తున్నార‌ని, దీనివ‌ల్ల సామాన్యులు ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంద‌నే విషయం చ‌ర్చ‌కు వ‌చ్చింది. లే అవుట్‌కు అనుమ‌తి ఉంటేనే ప్లాట్ల‌కు రిజిస్ట్రేష‌న్ చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటే మంచిద‌ని అభిప్రాయానికి వచ్చారు. ఇక ప్ర‌స్తుతం జిల్లా ప‌రిష‌త్‌, మండ‌ల ప‌రిష‌త్‌లలో ఉన్న‌ట్లుగానే పంచాయ‌తీ పాల‌క‌వ‌ర్గ స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యే స‌భ్యుల‌కు కూడా సిట్టింగ్ ఫీజు ఇవ్వాల‌నే అభిప్రాయాలు వ్య‌క్తమయ్యాయి. ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో మిన‌హా వ‌రుస‌గా మూడు సార్లు పాల‌క‌వ‌ర్గ స‌మావేశాల‌కు డుమ్మా కొడితే అన‌ర్హ‌త వేటు కూడా వేసే విష‌యంపై చ‌ర్చించారు.  

పంచాయ‌తీల్లో కో ఆప్ష‌న్ స‌భ్యులను నియ‌మించే అంశాన్ని ప‌రిశీలిస్తున్న స‌బ్ కమిటీ, ఇందులో ఎన్ఆర్ఐల‌కు, గ్రామంలో లేని వారికి కూడా అవ‌కాశం ఇస్తే ఎలా ఉంటుంద‌నే అంశంపై, పంచాయ‌తీలోని జ‌నాభాను అనుసరించి ఇద్ద‌రు, ముగ్గురిని కూడా నామినేట్ చేసుకునే అవ‌కాశాల‌పై క‌మిటీ స‌భ్యులు చ‌ర్చించారు. 200 చ‌ద‌ర‌పు గ‌జాల లోపు విస్తీర్ణంలో జీ ప్ల‌స్ 2 ఎత్తులో నిర్మించే భ‌వ‌నాల అనుమ‌తులను గ్రామ‌ పంచాయ‌తీలో ఇస్తుండ‌గా...అంత‌క‌న్నా ఎక్కువ విస్తీర్ణంలో అయితే మండ‌లాల్లోనూ ఎంపీడీఓ, త‌హ‌సీల్డార్‌, ఈఓ పీఆర్డీ, పంచాయ‌తీరాజ్ ఏఈల నేతృత్వంలో క‌మిటీ ఏర్పాటు చేసి అనుమ‌తించే అంశంపైనా చ‌ర్చించారు.  

  • Loading...

More Telugu News