దేవుని కడప

ఓ వైపున శతాబ్దాల చరిత్ర కలిగిన క్షేత్రంగా...మరోవైపున మహా భక్తుల మనసు గెలుచుకున్న క్షేత్రంగా మనకు 'దేవుని కడప' కనిపిస్తుంది. తిరుమల తిరుపతికి వెళ్లే మార్గంలో ... కడప సమీపంలో ఈ దివ్య క్షేత్రం విరాజిల్లుతోంది. ఇక్కడ అడుగుపెట్టిన భక్తులకు ప్రధాన దైవంగా శ్రీలక్ష్మీ సమేత వేంకటేశ్వరస్వామి వారు దర్శన మిస్తాడు.
ఏడుకొండల స్వామి క్షేత్ర ప్రవేశానికి ఈ ప్రదేశం కడప (గడప ) గా భావించేవారు. ఈ కారణంగానే తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరి వెళుతోన్న భక్తులు ముందుగా ఇక్కడి స్వామిని దర్శించుకుని వెళ్ళడమనేది గతంలో ఒక ఆచారంగా వుండేది. ప్రాచీనకాలం నుంచి ఎంతోమంది రాజులు స్వామివారిని దర్శించుకుని ఆయన సేవలో తరించారు. ఆలయ అభివృద్ధికి ఎనలేని సేవలను అందించారు. సాళ్వ నరసింహరాయలు ... శ్రీకృష్ణ దేవరాయలు స్వామివారికి మడిమాన్యాలు ఏర్పాటుచేసినట్టు, అమూల్యమైన రత్నాభరణాలను కానుకలుగా సమర్పించినట్టుగా ఆధారాలు కనిపిస్తునాయి.
హనుమంతుడు క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తోన్న ఈ క్షేత్రాన్ని అన్నమయ్య అనేక సార్లు దర్శించి, స్వామివారికి సంకీర్తనాభిషేకం చేసినట్టుగా స్థల పురాణం చెబుతోంది. విశాలమైన ప్రదేశంలో శిల్పకళా వైభవం ఉట్టిపడుతోన్న ఆలయంలో స్వామివారు సర్వాలంకారశోభితుడై కనువిందు చేస్తుంటాడు. ఆ పక్కనేగల మందిరంలో లక్ష్మీదేవి అమ్మవారు కొలువుదీరి వుంటుంది. ఇక 6 వ శతాబ్దానికి చెందినదిగా కనిపిస్తోన్న 'హనుమత్ పుష్కరిణి' మహిమాన్వితమైనదిగా భక్తులు విశ్వసిస్తుంటారు.
ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో 'కడప'కు అధికారిగా ఉన్న పరమ నాస్తికుడైన సర్ థామస్ మన్రోని కూడా ఇక్కడి స్వామి తన మహిమలతో కట్టిపడేశాడు. దాంతో ఆయన స్వామివారి భక్తుడిగా మారిపోవడమే కాకుండా, ప్రభుత్వం తరఫున ఆలయ సేవలకు అవసరమైన ఆర్ధిక వనరులను ఏర్పాటు చేసినట్టు ఆధారాలు చెబుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ క్షేత్రంలో జరిగే 'రథోత్సవం' ... 'తెప్పోత్సవం' చూసి తీరవలసిందే గానీ, మధురమైన ఆ అనుభూతిని ఆవిష్కరించడానికి మాటలు చాలవు.









