మహిమాన్విత క్షేత్రం భైరవకోన

'భైరవకోన' అనే పేరే వినడానికి బాగుంటుంది. పరమేశ్వరుడి లీలా విశేషాలకు నెలవైన మహిమాన్విత క్షేత్రంగా అనిపిస్తుంది. ప్రకాశం జిల్లా పరిధిలోని 'అంబవరం' .. 'కొత్తపల్లి' గ్రామాల మధ్యగల అడవి ప్రదేశంలో ఈ క్షేత్రం వుంది. ఈ కోన .. గుహాలయాలకు ప్రసిద్ధి. ఇక్కడ ఎనిమిది గుహాలయాలు దర్శనమిస్తాయి. చాళుక్య ప్రభువైన 'మంగళేశుడు' ఈ గుహాలయాలకు శ్రీకారం చుట్టాడని స్థలపురాణం చెబుతోంది.

ఇక్కడ మహాశివుడు మూడు శరీరాలతో తపోధ్యానంలో కనిపిస్తాడు. అకాలమృత్యుపాపహరిణిగా దుర్గాదేవి దర్శనమిస్తుంది. ఈ ప్రాంతంలో 125 గుండాలు కనిపిస్తాయి. శివనాగలింగం .. రుద్రలింగం .. విశ్వేశ్వర లింగం .. నగరికీశ్వర లింగం .. భరేశ్వర లింగం .. రామలింగేశ్వర లింగం .. మల్లికార్జున లింగం .. పక్షిఘాత లింగం .. భైరవలింగంతో పాటు అనేక లింగాలు ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన అకాల మృత్యు భయం తొలగిపోతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. కార్తీక మాసంలోను .. దసరా నవరాత్రుల్లోను ఈ క్షేత్రాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.


More Bhakti News