చెన్నకేశవస్వామి మహిమ అలాంటిది

సూర్యాపేట జిల్లా పరిధిలోని ప్రాచీన రామాలయాలలో ఒకటి 'తమ్మర బండపాలెం'లో కనిపిస్తుంది. కోదాడకు సమీపంలో ఈ రామాలయం వెలుగొందుతోంది. పొడవైన ప్రాకారాలతో .. ఎత్తైన గాలిగోపురాన్ని కలిగిన ఈ ఆలయంలో సీతారాములతో పాటు చెన్నకేశవస్వామి మూర్తి కూడా దర్శనమిస్తూ ఉంటుంది. చెన్నకేశవస్వామి మూర్తి ఇక్కడ ప్రతిష్ఠించబడటం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది.

కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ గ్రామం మధ్యలో చెన్నకేశవస్వామి మూర్తి శిధిలావస్థలో ఉండేదట. ఓ భక్తురాలు అనునిత్యం ఆ మూర్తిని పూజిస్తూ ఉండేదట. ఆ మూర్తిని తమ ఊరు ఆలయంలో ప్రతిష్ఠించాలని సమీప గ్రామస్థులు భావించారు. అందుకు సంబంధించిన అనుమతులు తీసుకోవడం కూడా జరిగిపోయింది. దాంతో చెన్నకేశవస్వామి మూర్తిని తీసుకుని సమీప గ్రామస్థులు ఎడ్లబండిపై బయల్దేరారు. తాను అనునిత్యం పూజించే స్వామి తనకి దూరమైపోతున్నాడని ఆ భక్తురాలు కన్నీళ్లు పెట్టుకుందట. అంతే ఆ ఎడ్లబండికి కట్టిన ఎడ్లు ముందుకు వెళ్లడానికి మొరాయించి, వెనక్కి తిరిగి నేరుగా ఇప్పటి రామాలయం దగ్గరికి చేరుకున్నాయట. అది స్వామివారి ఆదేశంగా .. ఆయన లీలావిశేషంగా భావించిన భక్తులు ఆ ఆలయంలోనే ఆ మూర్తిని ప్రతిష్ఠించారు.    


More Bhakti News