సూర్యభగవానుడే సంక్రాంతి పురుషుడు

సంక్రాంతి అంటే 'చక్కని మార్పు' అని అర్థం. సూర్యభగవానుడు ఒక రాశిలో నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడల్లా ఈ మార్పు జరుగుతూ ఉంటుంది. అలా సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అనీ .. మహా సంక్రాంతి అని అంటారు. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన దగ్గర నుంచి ఉత్తరాయణము మొదలవుతుంది. సంక్రమణానికి పదహారు ఘడియల ముందు .. పదహారు ఘడియల తరువాత కాలాన్ని పుణ్య కాలంగా పరిగణిస్తారు. ప్రతి మాసంలోను కొత్త రాశిలోకి ప్రవేశించేటప్పుడు సూర్యుడు సంక్రాంతి పురుషుడవుతాడు.

సంక్రాంతి రోజున సూర్యభగవానుడికి నమస్కరించడం వలన .. ఆయనని పంచోపచారాలతో ఆరాధించడం వలన వివిధ రకాల వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది. ఈ రోజున వస్త్ర దానం చేయడం వలన .. నువ్వులు .. బెల్లం దానం చేయడం వలన .. నువ్వుల నూనెతో శివాలయంలో దీపం వెలిగించడం వలన .. విశేషమైన ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ రోజునే చేసే స్నానం .. జపం .. హోమం .. దానం వేయిరెట్ల ఫలాన్ని ఇస్తాయి. 'భోగి' రోజున చిన్న పిల్లలకు 'భోగిపండ్లు' పోస్తుంటారు .. 'సంక్రాంతి' రోజున తెలగపిండితో స్నానం చేసి .. భోజనంలోకి గుమ్మడికాయతో చేసిన వంటకాలు ఉండేలా చూసుకుంటారు. 'కనుమ' రోజున పశువులను పూజిస్తారు .. భోజనంలోకి నువ్వులతో కూడిన పదార్థాలు ఉండేలా చూసుకుంటారు. చలికాలంలో చలిని తట్టుకునే శక్తిని పొందడమే ఈ ఆచారాల్లో భాగంగా కనిపిస్తుంది.    


More Bhakti News