అదే ఇక్కడి రామచంద్రుడి ప్రత్యేకత

సాధారణంగా రామాలయాలలో శ్రీరామచంద్రుడు కోదండాన్ని ధరించి .. సీత .. లక్ష్మణ సమేతుడై కనిపిస్తుంటాడు. తన పాదాలకి నమస్కరిస్తోన్న హనుమను ఆశీర్వదిస్తున్నట్టుగా దర్శనమిస్తుంటాడు. మరికొన్ని క్షేత్రాల్లో పట్టాభిషేక చిత్రాన్ని గుర్తుకు తెస్తున్నట్టుగా స్వామివారు సీతమ్మవారితో పాటు తన సోదరుల మూర్తులతో కలిసి దర్శనమిస్తుంటాడు. చిత్తూరు జిల్లా 'వాయల్పాడు' క్షేత్రంలో మాత్రం స్వామివారు ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తుంటాడు.

'వాయల్పాడు' క్షేత్రానికి పూర్వనామం 'వాల్మీకీపురం' అని స్థలపురాణం చెబుతోంది. స్వామివారి మూర్తి 'పుట్ట'లో నుంచి బయటపడటం వలన ఈ పేరు వచ్చిందట. ఇక్కడి స్వామివారు తిరుమల వేంకటేశ్వరస్వామి మాదిరిగా వైకుంఠ ముద్రను కలిగి వుండటం విశేషం. స్వామివారు ఖడ్గాలను ధరించి ఉండటం వలన, 'ప్రతాపరాముడు' అనే పేరుతో భక్తులు కొలుస్తుంటారు. ఇక్కడ స్వామివారు ప్రత్యక్షంగా వున్నారని విశ్వసిస్తుంటారు. 'అన్నమయ్య' ఈ క్షేత్రాన్ని దర్శించి .. ఇక్కడి స్వామివారిపై కూడా కొన్ని కీర్తనలు రాసినట్టు చెబుతారు.    


More Bhakti News