ఇక్కడ ప్రథమంగా చేసుకునేది హనుమ దర్శనమే

నరసింహస్వామి ఆవిర్భవించిన పరమపవిత్రమైన క్షేత్రాలలో 'పెంచలకోన' ఒకటి. స్వామివారు వెలసిన కొండను 'వెలికొండ' అంటారు. నెల్లూరు సమీపంలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. స్వామివారు 'చెంచులక్ష్మి'ని వివాహం చేసుకున్నది ఇక్కడేనని స్థలపురాణం చెబుతోంది. ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకత వుంది. నరసింహస్వామిని దర్శించుకోవడానికంటే ముందు .. భక్తులు క్షేత్ర పాలకుడైన హనుమంతుడిని దర్శించుకుంటారు.

రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్చిల్లగా సంజీవని కోసం హనుమంతుడు ఇక్కడికి వచ్చాడట. ఇక్కడి పర్వతాన్ని పెకిలించడానికి ప్రయత్నించగా అది విరిగిపోయిందట. రామకార్యానికి భంగం వాటిల్లుతుందని ఆగ్రహించిన హనుమంతుడు, ఆ కొండను పర్వత సమూహం నుంచి వెలివేశాడు. ఈ కారణంగానే ఈ  కొండకు 'వెలికొండ' అనే పేరు వచ్చిందని చెబుతారు. క్షేత్ర పాలకుడు కావడం వలన ఇక్కడికి వచ్చే భక్తులు ఎలాంటి ఆపదల బారిన పడకుండా క్షేమంగా తిరిగి వెళ్లే బాధ్యతలను హనుమంతుడు చూసుకుంటూ ఉంటాడని చెబుతుంటారు.      


More Bhakti News