ఆడపిల్ల - ఆదిలక్ష్మి

సాధారణంగా ఏ ఇంటి ఆడపిల్లను ... ఆ ఇంటివారు లక్ష్మీదేవిగా భావిస్తుంటారు. అదృష్ట మనేది ఆడపిల్లతోనే వస్తుందనే నమ్మకం పూర్వకాలం నుంచీ వస్తోంది. అందుకే 'బిడ్డొచ్చిన వేళ ... గొడ్డొచ్చిన వేళ' అని అనడం మొదలు పెట్టారు. ఎంతైనా కూతురుపై మమకారం వుంటుంది కాబట్టి, కొందరు ఈ మాటను పక్కన పెట్టి మంచి చెడులకు ఇతరుల ఆడపిల్లలను(కోడళ్ళను)బాధ్యులను చేయడం మొదలు పెట్టారు.

కొత్త కోడలు వచ్చిన తరువాత మంచి జరిగితే సరేసరి ... లేదంటే అక్కడి నుంచి ఆమెను ఆడిపోసుకోవడం మొదలు పెడతారు. నిజానికి ఏ కోడలైనా తాను అడుగుపెట్టిన అత్తవారిల్లు బాగుండాలనే కోరుకుంటుంది. కానీ చాలా కుటుంబాల్లో కోడలిని తమ కుటుంబ సభ్యుల్లో కలుపుకు పోకుండా పరాయిదానిలానే చూస్తూ, ఆమె తమ చెడును కోరుకుంటోందని భావిస్తూ వుంటారు.

అయితే కూతురైనా ... కోడలైనా ఆడపిల్లే కనుక, ఆమె కంట తడి పెట్టడం లక్ష్మీదేవికి బాధ కలిగిస్తుందట. అందుకే అలాంటి వారి ఇంటికి రావడానికి ఆమె ఇష్టపడదని శాస్త్రం చెబుతోంది. కోడలిని ఆడిపోసుకోవడం సరికాదనడానికి ఉదాహరణగా సీతమ్మవారి జీవితాన్ని చూపుతోంది. శ్రీ రాముడు అడవుల పాలైంది ... సీతమ్మను పెళ్లాడటం వల్లనేనని అంతటి రామాయణంలో ఏ ఒక్కరూ అన్నట్టుగా కనిపించదు. అంటే అత్తవారింట ఏర్పడే అవాంతరాలకు కోడలు ఏ రకంగాను కారణం కాదని తెలుస్తోంది. ఈ విషయాన్ని గ్రహిస్తే కొత్త కోడళ్లు కన్నీరు పెట్టవలసిన పని వుండదు ... లక్ష్మీదేవి రాకకు ఆటంకము వుండదు.


More Bhakti News