మంచినీళ్లిస్తే మహా పుణ్యం

వర్షం కురవడం వలన ప్రకృతి పచ్చదనాన్ని సంతరించుకుని కళకళలాడుతూ కనిపిస్తుంది. సమస్త జీవులు ఆహారం కోసం ఆ ప్రకృతి పైనే ఆధారపడి వుంటాయి. జీవనాన్ని కొనసాగించడానికి ప్రధమ అవసరంగా ... ప్రధానమైన అవసరంగా నీరు కనిపిస్తూ వుంటుంది. అందుకే నాగరికతలన్నీ కూడా నదులవెంటే వెలిశాయి. ఆహారం తీసుకోకుండా ఎక్కువ సమయం ఉండగలరేమోగానీ, దాహం తీర్చుకోకుండా ఎవరూ ఎక్కువసేపు ఉండలేరు.

ప్రాణాలను నీరు నిలబెడుతుంది కనుకనే, ఎవరైనా దాహం అనగానే మంచినీళ్లు అందించడానికి సాటివారు ఆత్రుత పడుతుంటారు. అలాంటి మంచినీళ్లను దానం చేయడం వలన మహాపుణ్యం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే వేసవి కాలంలో చాలామంది 'చలివేంద్రాలు' ఏర్పాటు చేసి అందరికీ మంచినీళ్లు అందజేస్తూ వుంటారు. ఇక ఈ కాలంలో చేయబడిన పూజలు ... వ్రతాల చివరలో మంచినీటి కడవలను దానంగా ఇవ్వమని శాస్త్రం చెప్పడంలోని ప్రధాన ఉద్దేశం ఇదే.

జీవితంలో తెలిసో తెలియకో చేసిన పాపాలు ... వాటివలన కలిగే దోషాలు తొలగిపోవాలంటే ఎన్నో పుణ్యకార్యాలు చేయాలి. ఎలాంటి పుణ్యకార్యాలు చేయాలని ఆలోచించే వాళ్లు, మంచినీటి దానాన్ని ఒక మహా యజ్ఞంగా భావించి నిర్వహించవచ్చు. స్తోమత కలిగిన వాళ్లు కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని అక్కడి ప్రజలకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించవచ్చు. లేదంటే మంచినీరు అందుబాటులో లేని ప్రదేశాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయవచ్చు.

భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఆలయాల చెంత కూడా మంచినీటి వసతి కల్పించవచ్చు. మూగ జంతువులు ... పక్షులు తాగేలా ఇంటి ఆవరణలో నీటి తొట్లను ఏర్పాటు చేయడం కూడా ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. మంచినీటి దానం పెద్దఎత్తున చేస్తేనే గాని పుణ్యం రాదనీ కొంతమంది అనుకుంటూ వుంటారు. కానీ మనచేతిలో వున్న మంచినీళ్లు మరో జీవి దాహాన్ని తీరుస్తే, అంతకుమించిన మహాపుణ్యం మరేదీ లేదని గ్రహించాలి.


More Bhakti News