భక్తుల సంఖ్యను బట్టి పెరిగే కోనేటి ధార !

సాధారణంగా పుణ్యక్షేత్రాలకి వెళ్లిన భక్తులు ముందుగా అక్కడి తీర్థంలో స్నానమాచరించి ఆ తరువాత దైవదర్శనం చేసుకుంటూ ఉంటారు. అత్యంత పవిత్రమైనదిగా చెప్పుకునే అక్కడి కోనేటిలో భక్తులు సామూహికంగా స్నానాలు చేస్తుంటారు. ఎంతమంది స్నానాలు చేసినా అందులోని నీళ్లు పెరగడం గానీ ... తగ్గడం గాని జరగదు. అయితే ఒక కోనేరులోకి ధారగా వచ్చే నీరు భక్తుల సంఖ్యను బట్టి మారుతూ ఉంటుందని చెబుతుంటారు.

'చింతామణి' పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ కోనేరు వరంగల్ జిల్లా 'గీసుకొండ' క్షేత్రంలో కనిపిస్తుంది. లక్ష్మీనరసింహస్వామి ఆవిర్భవించిన ఈ క్షేత్రంలో ఈ కోనేరు తన విశిష్టతను చాటుకుంటోంది. కాకతీయుల పరిపాలనాకాలంలో పండితుడిగా పేరు ప్రఖ్యాతులను సంపాదించిన 'వాగీశ్వరుడు' స్వామివారికి ఆలయాన్ని నిర్మించినట్టు ఆధారాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన శాసనాలు మనకు వరంగల్ ప్రాంతానికి చెందిన తొర్రూరు సమీపంలో గల 'రెడ్ల వాడ'లో కనిపిస్తాయి.

ఇక మనసులో కోరికను చెప్పుకుని ఇక్కడి కోనేరులో స్నానం చేస్తే అనతికాలంలోనే ఆ కోరిక నెరవేరుతుందని అంటారు. కోరికలు నెరవేర్చే కోనేరు కనుకనే దీనికి 'చింతామణి కోనేరు' అనే పేరు వచ్చిందని స్థలపురాణాన్ని బట్టి తెలుస్తోంది. నిరంతరం ఇక్కడి కోనేరులోకి ధారగా నీరు వస్తూ ఉంటుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందన్నది ఎవరికీ అంతుబట్టకపోవడం విశేషం. ఈ నీటి ధార దగ్గరే భక్తులు స్నానం చేస్తుంటారు.

భక్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు ఈ నీటి ధార ఎక్కువగా ఉండటం, భక్తుల సంఖ్య తక్కువగా ఉంటే ధార సన్నగా రావడం స్థానికులు గమనించారట. నిజంగా ఇది ఈ క్షేత్ర మహిమగా చెప్పుకునే విషయమేనని వాళ్లు అంటారు. వివాహం ... సంతానం విషయాల్లో ఆలస్యమైన వాళ్లు, ఈ కోనేరుకి తమ మనసులో మాటను చెప్పుకుంటూ ఉంటారు. నిజంగానే తమ కోరిక నెరవేరిందంటూ చింతామణి కోనేరు మహిమను అంగీకరించే వాళ్లు ఇక్కడ కనిపిస్తారు.


More Bhakti News