విజయాలను ఇచ్చే పాతాళ వినాయకుడు
తొలిపూజలు అందుకునే వినాయకుడు స్వయంభువు మూర్తిగా అనేక క్షేత్రాల్లో ఆవిర్భవించాడు. అలాంటి మహిమాన్వితమైన క్షేత్రాల్లో ఒకటిగా 'శ్రీకాళహస్తి' కనిపిస్తుంది. పంచభూత క్షేత్రాల్లో ఒకటైన శ్రీకాళహస్తిలో 'పాతాళ వినాయకుడు' కూడా దర్శనమిస్తూ ఉంటాడు. ఈ స్వామిని గురించి ధూర్జటి 'శ్రీ కాళహస్తి మహాత్మ్యం'లోను .. శ్రీనాథుడి 'హరవిలాసం'లోను ప్రస్తావన వుంది. నలభై అడుగుల లోతులో స్వామివారు కొలువై ఉండటం వెనుక, ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది.
పూర్వం అగస్త్యుడు ఈ క్షేత్రంలో జీవనదిని ప్రవహింపజేయాలనే ఉద్దేశంతో పరమశివుడిని ప్రార్ధించాడు. స్వర్ణముఖి నది పాయ ఏర్పడింది కానీ అందులో నీళ్లు లేవు. వినాయకుడిని ప్రార్ధించకుండా ఈ కార్యానికి పూనుకోవడమే అందుకు కారణమని గ్రహించిన అగస్త్యుడు, ఆ స్వామిని ప్రార్ధించాడు. పాతాళ మార్గంలో అక్కడికి చేరుకున్న వినాయకుడు ఆ మహర్షి కోరికను నెరవేర్చాడు. అగస్త్యుడి కోరిక మేరకు ఆయనకి దర్శనమిచ్చిన చోటునే వెలిశాడు. ఇక్కడి వినాయకుడిని పూజించడం వలన ఆటంకాలు తొలగిపోయి విజయాలు కలుగుతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.