కనుమ రోజున పశువులను పూజించేది ఇందుకోసమే
తెలుగువారి పెద్ద పండుగగా సంక్రాంతిని గురించి చెబుతారు. భోగి .. సంక్రాంతి .. కనుమ .. ముక్కనుమ .. ఇలా ఈ నాలుగు రోజులలో ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. 'భోగి' రోజున భోగిమంటలు వేస్తారు .. 'సంక్రాంతి' రోజున సూర్య భగవానుడిని పూజిస్తారు. ఇక 'కనుమ' రోజున ఆవులను .. ఎద్దులను పూజిస్తారు. పాడిపంటలతో జీవితం ఆనందమయంగా సాగిపోవడంలో పశువులు ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. తమ యజమానులకు సాయంగా వుంటూ .. వాళ్లకన్నా ఎక్కువగా అవి కష్టపడతాయి.
అందువలన ఈ రోజున పశువుల కొట్టంను శుభ్రం చేసి .. పూల దండలతో అలంకరిస్తారు. పశువులను శుభ్రంగా కడిగి .. వాటిని అలంకరిస్తారు. ఈ రోజున వాటితో ఎలాంటి పనులు చేయించకుండా, పూర్తి విశ్రాంతిని ఇస్తారు. ఆ రోజున సాయంత్రం 'పొంగలి' చేసి వాటికి నైవేద్యంగా పెడతారు. ఇలా పశువుల పట్ల ప్రేమానురాగాలు చాటుకుంటూ .. వాటిని పూజిస్తూ కనుమ పండుగను జరుపుకుంటారు. ఈ విధంగా చేయడం వలన పశువృద్ధి .. ధనధాన్యాల వృద్ధి కలుగుతుందనేది పెద్దల నమ్మకం.