ఏకామ్రేశ్వరుడుకి అందుకే ఆ పేరు

విష్ణు కంచి .. శివకంచి అనే రెండు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాలు భక్తులను తరింపజేస్తున్నాయనే విషయం తెలిసిందే. శివకంచిలో శివుడు 'ఏకామ్రేశ్వరుడు'గా అమ్మవారు 'కామాక్షీదేవి'గా పూజలు అందుకుంటూ వుంటారు. పంచభూత  క్షేత్రాలలో ఈ కంచి (కాంచీపురం) ఒకటిగా ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. పృథ్వీ లింగంగా స్వామివారు ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాడు. ఒక మామిడి చెట్టు క్రింద ఈశ్వరుడు ఆవిర్భవించడం వలన, స్వామివారికి ఏకామ్రేశ్వరుడు అనే పేరు వచ్చిందనేది స్థల పురాణం.

కాత్యాయన మహర్షి తపస్సుకు మెచ్చి ఆయన ఆశ్రమంలో ఆయన కూతురుగా పెరిగిన కాత్యాయనీ దేవి, యుక్తవయసులోకి అడుగుపెడుతుంది. ఈశ్వరుడిని భర్తగా పొందడం కోసం ఈ ప్రదేశానికి చేరుకొని, ఇక్కడి మామిడి చెట్టుకింద శివుడి కటాక్షం కోసం కఠోర తపస్సు చేస్తుంది. ఆమె భక్తిని పరీక్షించిన శివుడు.. ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. ఆ ఇద్దరి వివాహాన్ని జరిపించిన దేవతలు, ఈ ప్రదేశంలోనే కొలువుదీరి మానవాళిని తరింపజేయమని కోరతారు. అందుకు అంగీకరించిన స్వామివారు .. అమ్మవారు ఇక్కడే కొలువుదీరి, భక్తులను అనుగ్రహిస్తున్నారు. మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన, సమస్త పాపాలు నశించి .. ధర్మబద్ధమైన కోరికలు నెరవేరతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.      


More Bhakti News