పాపాలను తొలగించే ఆర్ద్రోత్సవం
తెలిసి తెలియక చేసిన పాపాలు జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. ఆ పాపాల ఫలితాలను ఏదో ఒక సమయంలో అనుభవించవలసి వస్తూ ఉంటుంది. అలాంటి పాపాల నుంచి విముక్తిని పొందడానికి శివ నామస్మరణమే మార్గం. శివ దర్శనం వలన .. శివనామ స్మరణ వలన పాపాలు నశిస్తాయి. ముఖ్యంగా స్వామివారి 'ఆరుద్ర' నక్షత్రం రోజున స్వామివారి ఆరాధన అనంతమైన పుణ్య ఫలాలను అందిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
పుష్య మాసంలో వచ్చే 'ఆరుద్ర' నక్షత్రం రోజున శైవ క్షేత్రాలలో 'ఆర్ద్రోత్సవం' నిర్వహిస్తారు. ఆ రోజున ఆయా శైవాలయాలలో విశేషంగా నిర్వహించే 'ఆర్ద్రోత్సవం'ను తప్పక దర్శించాలి. అలా దర్శించుకోవడం ధన్యులను చేస్తుందనేది మహర్షుల మాట. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి .. ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం చేయాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో పరమశివుడిని బిల్వ దళాలతో పూజించాలి. స్వామివారి ఆలయంలో దీపాలను వెలిగించాలి. ఈ విధంగా స్వామివారి జన్మ నక్షత్రం రోజున ఆయనను అంకితభావంతో ఆరాధించడం వలన, సమస్త పాపాలు తొలగిపోయి .. సకల శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.