వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు పూజ ఫలితం
ధనుర్మాసం .. శ్రీమహా విష్ణువుకు ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో చేసే విష్ణు పూజ విశేషమైన ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని 'వైకుంఠ ఏకాదశి' అని అంటారు. 'తొలి ఏకాదశి'గా చెప్పబడే 'ఆషాఢ శుద్ధ ఏకాదశి' రోజున పాల సముద్రంలో యోగ నిద్రలోకి వెళ్లిన శ్రీ మహా విష్ణువు .. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొని .. ఈ ఏకాదశి రోజున శ్రీదేవి .. భూదేవి సమేతుడై వైకుంఠానికి విచ్చేస్తాడు.
ఆ సమయంలో వైకుంఠపు ఉత్తర ద్వారం దగ్గర ముక్కోటి దేవతలంతా వేచి వుండి .. స్వామిని సేవిస్తారట. ఈ కారణంగానే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచే దేవతలకు పగటి కాలం ప్రారంభమవుతుంది. ఈ రోజున భక్తులంతా సూర్యోదయం కంటే ముందుగానే నిద్రలేచి .. స్నానం చేసి వైష్ణవ ఆలయాలకు వెళుతుంటారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని తరిస్తుంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన, సమస్త పాపాలు నశించి సకల శుభాలు చేకూరుతాయనేది మహర్షుల మాట.