దత్త జయంతి రోజున స్వామివారి ఆరాధన ఫలితం
బ్రహ్మ .. విష్ణు .. రుద్ర అంశాలతో దత్తాత్రేయ స్వామి 'మార్గ శిర శుద్ధ చతుర్దశి' రోజున జన్మించాడు. అందువలన ఈ రోజున భక్తులంతా 'దత్త జయంతి'ని జరుపుకుంటూ వుంటారు. అత్రి మహర్షి .. అనసూయ దంపతులకు త్రిమూర్తులు ఇచ్చిన వరం కారణంగా, త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయులవారు జన్మించారు. అలాంటి దత్తాత్రేయస్వామి ఆధ్యాత్మిక సాధనకు మూలమైన యోగ విద్యకు పరమ గురువుగా పూజలు అందుకుంటున్నారు.
ఎంతో మంది దేవతలకు .. మహర్షులకు దత్తాత్రేయ స్వామి జ్ఞానోపదేశం చేశారు. సమస్త జీవరాశి నుంచి జ్ఞానాన్ని ఎలా గ్రహించాలనేది ఆయన చెప్పారు. దత్తాత్రేయస్వామి తనని నమ్మిన భక్తులను వెన్నంటి ఉంటూ కాపాడుతూ వుంటారనడానికి నిదర్శనంగా అనేక సంఘటనలు కనిపిస్తూ ఉంటాయి. ఆ స్వామి అనునిత్యం తన భక్తులను పరీక్షిస్తూ .. వాళ్లకి రక్షణగా నిలుస్తూ వుంటారు. అలాంటి దత్తాత్రేయస్వామిని ఆయన జయంతి రోజున షోడశ ఉపచారాలతో పూజించవలసి ఉంటుంది. ఆ స్వామికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించవలసి ఉంటుంది. మూగ జీవాలకు ఆహారాన్ని అందించవలసి ఉంటుంది. ఈ రోజున 'గురుచరిత్ర'ను పారాయణం చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేయడం వలన, ఆయురారోగ్యాలు .. సుఖసంతోషాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గంధాలు చెబుతున్నాయి.