తనని నమ్మిన భక్తులను భగవంతుడు ఎప్పుడూ గెలిపిస్తూనే ఉంటాడు
శ్రీరామచంద్రుడిని సేవించే వారన్నా .. తనని పూజించేవారన్నా హనుమంతుడికి ఎంతో ఇష్టం. అలాంటి భక్తులను ఆయన వెంటనే అనుగ్రహించేస్తూ ఉంటాడు. బుద్ధినీ .. బలాన్ని .. యశస్సును ప్రసాదించే ఆ స్వామిని పూజిస్తూ తరించిన భక్తులు ఎంతోమంది వున్నారు. అలాంటివారిలో తులసీదాస్ అగ్రగణ్యుడిగా కనిపిస్తాడు. ఆయన రాసిన 'హనుమాన్ చాలీసా' ఎంతటి ప్రాచుర్యాన్ని పొందినదో తెలిసిందే. అలాగే బుందేల్ ఖండ్ కి చెందిన 'మాన్' అనే కవి కూడా 'హనుమత్ పచాసా' అనే పేరుతో 50 కవితలను రచించాడు. ఆయన కవితల గురించి ప్రజలంతా మాట్లాడుకోవడం 'ఓక్రా' అనే పండితుడికి అసూయను కలిగించింది.
ఆయన కన్నా తానే గొప్ప కవిని అనే విషయాన్ని చాటి చెప్పడం కోసం 'ఓక్రా' రంగంలోకి దిగాడు. హనుమంతుడి విగ్రహం ఎదుట ఇద్దరం కవితలు చదువుదామనీ .. ఎవరు కవితలు చదువుతుండగా స్వామి విగ్రహంలో కదలిక వస్తుందో వారే గొప్ప కవి అనే విషయాన్ని అంగీకరించాలనే సవాల్ విసిరాడు. గ్రామస్తుల సమక్షంలో హనుమాన్ విగ్రహం ఎదుట కవితలు చదవడం మొదలైంది. 'ఓక్రా' తాను రాసిన కవితలు చదువుతుండగా స్వామి విగ్రహం ఎప్పటి మాదిరిగానే వుంది. 'మాన్' తాను రాసిన కవితలు చదువుతుండగా .. హనుమంతుడి విగ్రహం తల ఆయన వైపుకు తిరిగిందట. దాంతో 'మాన్' గొప్ప కవి .. మహా భక్తుడు అనే విషయం అందరికీ ప్రత్యక్షంగా తెలిసింది. తనని నమ్మిన భక్తులను భగవంతుడు ఎప్పుడూ గెలిపిస్తూనే ఉంటాడనే విషయం నిరూపించబడింది.