ఏకాదశులతో అత్యంత పవిత్రమైనది ఉత్థాన ఏకాదశి
కార్తీక శుద్ధ ఏకాదశికి 'బోధన ఏకాదశి' అని .. 'ఉత్థాన ఏకాదశి' అని పేరు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో శేషశయ్యపై యోగ నిద్రలోకి వెళ్లిన శ్రీ మహా విష్ణువు, ఈ రోజునే యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు. ఈ కారణంగానే దీనికి 'ఉత్థాన ఏకాదశి' అనే పేరు వచ్చింది. ఏకాదశులతో అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడే ఈ 'ఉత్థాన ఏకాదశి' రోజునే 'చాతుర్మాస్య వ్రతం' ముగుస్తుంది.
ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన, 'అశ్వమేధ యాగం' చేసిన ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. పూర్వం గుణవతి అనే యువతి ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన, మరుజన్మలో సత్యభామగా జన్మించి శ్రీ కృష్ణుడిని భర్తగా పొందిన వైనం ఆధ్యాత్మిక గ్రంధాల్లో కనిపిస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరించిన తరువాత ఒకరికి అన్నదానం చేస్తే .. సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో కోటిమందికి 'అన్నదానం' చేసిన ఫలితం దక్కుతుందనేది మహర్షుల మాట. ఈ ఏకాదశి రోజున వస్త్ర దానం చేయడం వలన .. బ్రాహ్మణులకు దక్షిణతో కూడిన తాంబూలాన్ని ఇవ్వడం వలన విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి.