సర్పదోషాలను నివారించే నాగ పూజ

ప్రాచీనకాలం నుంచి కూడా నాగుపాములను నాగ దేవతలుగా పూజించే ఆచారం వుంది. కొన్ని ప్రాంతాలలో నాగుల చవితిని 'శ్రావణ శుద్ధ చవితి' రోజున ఆచరిస్తుండగా, మరికొన్ని ప్రాంతాలలో 'కార్తీక శుద్ధ చవితి' రోజున ఆచరిస్తుంటారు. నాగుల చవితి రోజున ఉపవాసం నియమం వుంది. నియమనిష్టలు .. భక్తి శ్రద్ధలు ఆశించిన ఫలితాలను అందిస్తాయనేది శాస్త్ర వచనం. సాధారణంగా దేవాలయాలలో నాగ ప్రతిమలు ఉంటాయి. మరికొన్ని దేవాలయాలలోను .. ఆలయ ప్రాంగణంలోను నాగుల పుట్టలు ఉంటాయి. దగ్గరలో నాగుల పుట్ట ఎక్కడ వున్నా వెళ్లి దర్శనం చేసుకోవాలి.

 నాగ ప్రతిమకు అభిషేకం చేయడం .. నాగుల పుట్టలో పాలు పోయడం చేయాలి. నైవేద్యంగా నువ్వుల పిండిని .. చలిమిడిని .. వడ పప్పును సమర్పించాలి. ఇక పూజా మందిరంలో నాగ ప్రతిమ వున్నవారు, పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఆ అభిషేక జలాన్ని తీర్థంగా స్వీకరించాలి. నాగదేవతకి ఇష్టమైన జాజి .. సంపెంగ వంటి సువాసన గల పూలతో పూజించడం మరింత శ్రేష్టం. నాగ పూజ వలన సర్ప దోషాలతో పాటు .. సర్వ దోషాలు తొలగిపోతాయనీ, చర్మ సంబంధమైన వ్యాధులు నివారించబడతాయనేది మహర్షుల మాట.      


More Bhakti News