బలి పాడ్యమి .. భగినీహస్త భోజనం
కార్తీక శుద్ధ పాడ్యమి బలిచక్రవర్తికి ఎంతో ప్రీతికరమైనది. అందువల్లనే దీనిని 'బలి పాడ్యమి' అని అంటారు. ఈ రోజు ఉదయం ముగ్గుతో గానీ .. బియ్యపు పిండితో గాని బలి చక్రవర్తి బొమ్మను గీసి .. పూజించాలి. ఈ రోజున బలి చక్రవర్తిని పూజించి .. శక్తి కొలది దానం చేయడం వలన విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయనేది శాస్త్రవచనం.
కార్తీక శుద్ధ విదియ 'భగినీ హస్త భోజనం' రోజుగా చెప్పబడుతోంది. ఈ రోజుకే యమ ద్వితీయ .. భాతృ విదియ అని పేరు. ఈ రోజున 'యమున' తన అన్నగారైన యముడిని ఆహ్వానించి, ఆతిథ్యం ఇచ్చిన కారణంగా ఈ రోజుకు ఈ పేరు వచ్చింది. ఈ రోజున ఎవరైతే స్త్రీలు తమ సోదరులను ఇంటికి ఆహ్వానించి, స్వయంగా వంటచేసి ఆత్మీయంగా వడ్డిస్తారో, వాళ్ల సౌభాగ్యం వృద్ధి చెందుతుందని యమధర్మరాజు వరం ఇచ్చాడట. అంతేకాదు ఈ రోజున సోదరి చేతి భోజనం చేసిన సోదరులకు అపమృత్యు దోషం ఉండదని అన్నాడట. సౌభాగ్య వృద్ధి కోసం .. సోదరుల ప్రాణ రక్షణ కోసం ఈ రోజున వారిని ఆహ్వానించి భోజనం పెట్టడం మరిచిపోకూడదు.