కార్తీకంలో శివకేశవుల ఆరాధన ఫలితం
చాంద్రమానాన్ని అనుసరించి వచ్చే ఎనిమిదవ మాసం .. కార్తీకం. దీనిని వెన్నెల మాసమని కూడా అంటారు. మాసాల్లో కార్తీక మాసానికి సమానమైనది లేదనేది శాస్త్ర వచనం. శివకేశవులిద్దరికీ ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో, క్షేత్ర దర్శనం .. నదీ స్నానం .. దేవతారాధన .. ఉపవాసం .. కార్తీక దీపారాధన .. పురాణ పఠనం .. వనభోజనం ముఖ్యమైనవిగా చెప్పబడుతున్నాయి. ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి బావులు .. చెరువులు .. నదులలో తలస్నానం చేయాలి.
ఈ మాసమంతా కూడా శ్రీ మహా విష్ణువును తులసి దళాలతోను .. జాజిపూలతోను పూజించాలి. సదా శివుడిని జిల్లేడు పూలతోను .. మారేడు దళాలతోను పూజించాలి. కార్తీక మాసంలో పగలు ఉపవాసం వుండి .. రాత్రి భోజనం చేయడం మంచింది. ఇక ఈ నెల రోజుల పాటు ఉపవాసం చేయలేనివారు .. సోమవారాలలోను .. ఏకాదశి .. పౌర్ణమి .. మాస శివరాత్రి వంటి పర్వదినాలలో ఉపవాసం చేయడం విశేషమైన ఫలితాలను అందిస్తుంది. ఈ మాసమంతా కూడా పూజా మందిరంలోను .. ఇంటి ద్వారానికి ఇరువైపులా .. శివాలయాలలోను దీపాలు వెలిగించడం వలన సమస్త పాపాలు .. దోషాలు నశించి, అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయనేది మహర్షుల మాట.