మంగళవారం రోజున హనుమ ఆరాధన
మంగళవారం హనుమంతుడికి ఎంతో ఇష్టమైన వారమని అంటారు. అందువలన ఆ రోజున ఆ స్వామిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ వుంటారు. మంగళవారమే స్వామిని ఆరాధించడం వెనుక గల ఒక ఆసక్తికరమైన కథనం ఆధ్యాత్మిక గ్రంధాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఓ మంగళవారం రోజున సీతమ్మవారు పాపిటన సిందూరం ధరించడం చూసిన హనుమంతుడు .. అలా సిందూరం ధరించడానికి కారణమేమిటని అడిగాడట.
అలా చేయడం వలన శ్రీరాముడి ఆయుష్షు పెరుగుతుందని అమ్మవారు చెప్పడంతో, హనుమ వెంటనే అక్కడి నుంచి వెళ్లి ఒళ్లంతా సిందూరం పూసుకుని వచ్చాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన రామచంద్రుడు .. హనుమను చూసి విషయమేమిటని అడగగా, సీతమ్మవారు జరిగింది చెప్పిందట. తనపై హనుమకు గల ప్రేమకి ఆనందంతో పొంగిపోయిన రాముడు, ఎవరైతే మంగళవారం రోజున సింధూరంతో హనుమంతుడికి అభిషేకం చేస్తారో .. వాళ్ల ధర్మ బద్ధమైన కోరికలు నెరవేరతాయని సెలవిచ్చాడట. అలా శ్రీరామచంద్రుడి వరం కారణంగానే మంగళవారం రోజున హనుమ పూజలందుకుంటున్నాడట.