పుణ్య ఫలాలనిచ్చే క్షేత్ర దర్శనం
దైవం అనేక రూపాలతో .. అనేక నామాలతో ఆయా క్షేత్రాలలో పూజలు అందుకుంటూ ఉంటుంది. ఆ దైవాన్ని దర్శించుకోవడానికి భక్తులు ఎంతో దూరం నుంచి వస్తుంటారు. ఎన్నో కష్టాలు పడుతూ వచ్చి .. దైవ దర్శనం కాగానే అప్పటివరకూ పడిన కష్టాలను మరిచిపోయి అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతారు. సహజంగానే పుణ్యక్షేత్రాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందువలన దైవాన్ని దగ్గరగా .. కాసేపు స్థిరంగా చూసేంత సమయం దొరకదు.
స్వామిని సరిగ్గా దర్శించుకోలేకపోయామేనని అనుకునేవారు కొందరు మళ్లీ దర్శనానికి వెళుతుంటారు. అలా మళ్లీ వెళ్లడానికి శరీరం సహకరించనివారు అయ్యో స్వామిని సరిగ్గా చూడలేకపోయామేనని బాధపడతారు. కానీ భగవంతుడు భక్తులను చూడటానికి ఆ ఒక్క క్షణం చాలునని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. కనుక ఈ విషయంలో అసంతృప్తి చెందవలసిన పనిలేదు. పుణ్యక్షేత్రాల్లో అడుగుపెట్టినంత మాత్రాన .. పుణ్య తీర్థాన్ని తలపై చల్లుకోవడం వలన .. విమాన గోపుర దర్శనం చేసుకోవడం వలన సమస్త పాపాలు నశించి .. సకల శుభాలు కలుగుతాయి. ఇక క్షణకాలం దైవ దర్శనమైనా అనంతమైన పుణ్య ఫలాలు వెంటవస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.