అందుకే కనకదుర్గమ్మకు గాజులు సమర్పిస్తారు

ఆదిపరాశక్తి అయిన అమ్మవారు 'దుర్గముడు' అనే రాక్షసుడిని సంహరించడం వలన, అమ్మవారికి 'దుర్గాదేవి' అనే పేరు వచ్చినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.  'దుర్గా' అంటే దుర్గతులను నశింపజేసేది .. దుఃఖాన్ని దూరం చేసేది అని అర్థం. అందువల్లనే అమ్మవారిని 'దుర్గా' అని భక్తులు పిలుచుకుంటూ .. కొలుచుకుంటూ వుంటారు. అలాంటి ఆ తల్లి కొలువైన క్షేత్రాలలో ఒకటిగా 'విజయవాడ' కనిపిస్తుంది. అమ్మవారి కారణంగానే ఈ నగరానికి ఈ పేరు వచ్చింది. ఇక్కడి 'ఇంద్రఖీలాద్రి'పై అమ్మవారు ప్రత్యక్షంగా ఉందనడానికి నిదర్శనంగా ఒక కథ వినిపిస్తూ ఉంటుంది.

పూర్వం ఇక్కడి అమ్మవారిని పూజించే అర్చక స్వామి ఇంట్లో నలుగురు ఆడపిల్లలు ఉండేవారట. ఒకసారి గాజులమ్ముకునే ఒక వ్యక్తి అటుగా రావడంతో, ఆ నలుగురు అమ్మాయిలు గాజులు తొడిగించుకున్నారు. ఇంటి యజమాని డబ్బులు ఇవ్వడానికి వచ్చేసరికి, తాను ఐదుగురికి గాజులు తొడిగినట్టుగా ఆ గాజులబ్బాయి చెప్పాడు. తమ ఇంట్లో వున్నదే నలుగురు పిల్లలు .. ఐదో అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందంటూ ఆ యజమాని ఆశ్చర్యపోయాడు. తాను నిజమే చెబుతున్నానని ఆ గాజులబ్బాయి నమ్మకంగా చెప్పడంతో, ఆ యజమానికి ఏదో ఆలోచన వచ్చింది. వెంటనే ఆయన గుడిలోకి వెళ్లి చూశాడు. చేతి నిండుగా కొత్త గాజులతో అమ్మవారు దర్శనమిచ్చింది. అంతే ఆయన కనుల వెంట ఆనంద బాష్పాలు వర్షించాయి. సంతోషంతో ఆ గాజులబ్బాయికి డబ్బులు ఇచ్చి పంపించాడు. ఈ విషయం అంతటా తెలిసిపోవడంతో, ఇక్కడ అమ్మవారు ప్రత్యక్షంగా కొలువై ఉందని భక్తులు భావిస్తుంటారు. ఆ తల్లికి ఇష్టమైన గాజులను భక్తి శ్రద్ధలతో సమర్పిస్తుంటారు.     


More Bhakti News