బతుకమ్మకు ఒక్కో రోజు ఒక్కో నైవేద్యం!

బతుకమ్మ పడతుల పండుగ .. పల్లె వీధుల్లో సంతోషాల సందడి చేసే పండుగ. పట్టణాల్లోను తన ప్రత్యేకతను చాటుకుంటోన్న పండుగ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ పండుగ, భాద్రపద బహుళ అమావాస్య నుంచి మొదలై, ఆశ్వయుజ శుద్ధ దశమి వరకూ కొనసాగుతుంది. తొమ్మిది రోజుల పాటు ఒక్కో బతుకమ్మను పేరుస్తూ వెళతారు.

 మొదటి రోజున పేర్చిన 'ఎంగిలి బతుకమ్మ'కు నువ్వులు నైవేద్యంగా సమర్పిస్తారు. రెండో రోజు పేర్చిన 'అటుకుల బతుకమ్మ'కు బెల్లం - అటుకులు నైవేద్యంగా పెడతారు. మూడవ రోజున 'ముద్దపప్పు బతుకమ్మ'కు ముద్దపప్పు - బెల్లమే నైవేద్యం. నాలుగో రోజు 'నాన బియ్యం బతుకమ్మ'కు నానా బెట్టిన బియ్యం .. బెల్లంతో కూడిన పాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఐదో రోజున 'అట్ల బతుకమ్మ'కు 'అట్లు' నైవేద్యంగా పెడతారు. ఆరో రోజున 'అలిగిన బతుకమ్మ'కు నైవేద్యం ఉండదు .. ఆ తల్లి అలిగినట్టుగా భావిస్తారు. ఏడో రోజున 'వేపకాయల బతుకమ్మ'కు సకినాల పిండితో వేపకాయలు చేసి నైవేద్యంగా ఇస్తారు. ఎనిమిదో రోజున 'వెన్నముద్దల బతుకమ్మ'కు వెన్న - నెయ్యి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక తొమ్మిదో రోజున 'సద్దుల బతుకమ్మ'కు పెరుగన్నం .. పులిహోర .. కొబ్బరి .. నువ్వులు .. గోధుమ రొట్టెల పొడితో చేసిన వంటకాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.       


More Bhakti News