అందుకే పుష్పగిరి క్షేత్రానికి ఆ పేరు
భగవంతుడు ఆవిర్భవించిన మహిమాన్వితమైన క్షేత్రాలు ఆయా పేర్లతో పిలవబడుతూ ఉంటాయి. ఆయా క్షేత్రాలకు ఆ పేర్లు ఎందుకు వచ్చాయనే విషయంపై మనసు పెడితే కొన్ని ఆసక్తికరమైన కథలను గురించి తెలుస్తుంది. అప్పుడు ఆయా క్షేత్రాలపై మరింతగా భక్తి కలుగుతుంది .. మళ్లీ మళ్లీ అక్కడి స్వామి దర్శనం చేసుకోవాలనిపిస్తుంది.
వివిధ క్షేత్రాలలో శివకేశవులు కొలువైన క్షేత్రాలు మరింత ప్రత్యేకతను సంతరించుకున్నవిగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి క్షేత్రాల జాబితాలో 'పుష్పగిరి' ఒకటిగా కనిపిస్తూ ఉంటుంది. ఇది కడప జిల్లా పరిథిలో వెలుగొందుతోంది. ఇక్కడి కొండపై హరిహరులు భక్తులకు దర్శనమిస్తూ వుంటారు. పూర్వం సీతాదేవిని అపహరించిన రావణుడిని సంహరించడానికి శ్రీరామచంద్రుడు బయల్దేరాడు. మార్గమధ్యంలో ఇక్కడ ఆగిన శ్రీరామచంద్రుడు, కొన్ని రోజుల పాటు వైద్యనాథేశ్వర స్వామిని పూజించాడట. అలా పూజించిన పూలను మరునాడు ఉదయాన్నే తీసి ఒక ప్రదేశంలో వేసేవాడు. అలా ఆ పూలరాశి ఒక కొండల పెరిగిపోయిందట. ఈ కారణంగానే ఈ క్షేత్రానికి 'పుష్పగిరి' అనే పేరు వచ్చిందనే కథనాన్ని ఇక్కడ చెప్పుకుంటూ వుంటారు.