సాయినాథుడి లీలావిశేషమే అది!
శిరిడీ సాయిబాబాను ఆరాధించే భక్తులు అశేషమైన సంఖ్యలో వున్నారు. ఆపదల నుంచి .. అనారోగ్యాల నుంచి .. ఆర్ధిక పరమైన ఇబ్బందుల నుంచి తమని ఆయనే కాపాడుతూ ఉంటాడని వాళ్లంతా విశ్వసిస్తూ వుంటారు. బాబా చూపిన లీలావిశేషాలను కథలు కథలుగా చెప్పుకుంటూ వుంటారు. బాబా శిరిడీలో తిరుగాడుతున్నప్పుడు మహిమలెన్నో చూపాడు.
ఒకసారి బాబా భక్తుడైన శ్యామా పాము కాటుకు గురవుతాడు. పాముకాటుకు మంత్రం వేసే వాళ్లు .. మందిచ్చే వాళ్లు వేరే వున్నా, ఆయన బాబా దగ్గరికే వస్తాడు. ఆయనని చూడగానే కిందికి దిగిపొమ్మనీ .. పైకి వస్తే ఏం చేస్తానో చూడమని బాబా కోపంగా అంటాడు. బాబా ధోరణి శ్యామాకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బాబా ఆ మాట అన్నది శ్యామా శరీరంలో పైకి ఎక్కుతోన్న విషాన్ని అనే విషయం ఆ తరువాత అక్కడి వాళ్లకి అర్థమవుతుంది. బాబా మాట .. ఆయన కంటి చూపే విషానికి విరుగుడుగా పనిచేశాయని గ్రహిస్తారు. తనకి ప్రాణ భిక్ష పెట్టిన బాబా పాదాలపై పడి శ్యామా కృతజ్ఞతలు తెలియజేస్తాడు.