దేవాలయాన్ని శుభ్రం చేసినా పుణ్యమే
దైవ దర్శనానికి చాలామంది ఆలయాలకు వెళుతూ వుంటారు. భగవంతుడికి తమ మనసులోని మాటను చెప్పుకుని, ఆయన సేవలో పాల్గొనడానికి ప్రయత్నిస్తుంటారు. కొంతమంది ఆలయ మంటపంలో కూర్చుని కాసేపు భగవంతుడి నామస్మరణ చేస్తుంటారు .. మరికొందరు అక్కడ జరిగే ఆధ్యాత్మిక ప్రవచనాలను వింటూ వుంటారు. ఆలయ అభివృద్ధికి విరాళాలు సమర్పించుకుంటూ వుంటారు .. దేవాలయం దగ్గరున్న నిస్సహాయులకు తోచిన దానాలు చేస్తుంటారు.
ఎవరేం చేసినా .. ముందు జన్మలకి అవసరమైన పుణ్యం సంపాదించుకోవడం కోసమే. అలాగే దేవాలయాన్ని శుభ్రం చేయడం వలన కూడా ఎంతో పుణ్యం లభిస్తుందనేది మహానుభావుల మాట. భక్తుల రద్దీ కారణంగా దేవాలయ మంటపంలోను .. ప్రాంగణంలోను పరిశుభ్రత లోపిస్తుంటుంది. అప్పుడు వెంటనే పూనుకుని శుభ్రం చేయడం కూడా ఒక రకమైన సేవనే. భగవంతుడి సన్నిధిలో అలాంటి సేవ చేసే అవకాశాన్ని వదులుకోకూడదు. భగవంతుడికి చేసే ప్రతిసేవ .. ఆయన అనుగ్రహాన్ని వెంటతీసుకువస్తుందనే విషయాన్ని మరువకూడదు.