భక్తులకు ఏం కావాలో భగవంతుడికి తెలుసు
జీవితంలో ఆర్ధిక పరమైన ఇబ్బందులు .. అనారోగ్య పరమైన సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. అలాగే సాధించవలసిన వాటిని గురించిన చింత .. మనసును పట్టి కుదుపుతూనే ఉంటుంది. అందుకే దైవ దర్శనానికి వెళ్లినప్పుడు తమ మనసులోని కోరికలను చాలామంది చెప్పుకుంటూ వుంటారు. వాటిని నెరవేర్చవలసిన బాధ్యతను భగవంతుడికి అప్పగించేస్తుంటారు. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలు అడిగినవన్నీ ఇచ్చేయరు. ఏవి ఇస్తే మంచిదో అవే ఇస్తుంటారు. వాళ్ల మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కొన్ని ఇవ్వడానికి నిరాకరిస్తుంటారు.
భగవంతుడు కూడా అంతే .. అడిగినవన్నీ ఇవ్వడానికి ఆయన కూడా ఆలోచిస్తాడు. ఏవి అవసరమో అవే ఇస్తాడు .. ఎంతవరకూ అవసరమో అంతవరకే ఇస్తాడు. భగవంతుడిని భక్తి పూర్వకంగా దర్శనం చేసుకుంటే చాలు .. ఆయనని ఏమీ అడగవలసిన అవసరం లేదనేది మహానుభావుల మాట. ఎవరికి ఏమి అవసరమో భగవంతుడికి తెలుసనీ .. సమయానికి వాళ్లకి వాటిని అందేలా చూస్తుంటాడని అంటారు. భగవంతుడంటే అడిగినవన్నీ ఇచ్చేవాడు కాడనీ .. అవసరమైనవి ఇచ్చేవాడని చెబుతారు.