సాలగ్రామానికి కళ్లు .. ముక్కు .. చెవులు వచ్చాయట!
పూర్వం 'బృందావనం'లో గోపాలభట్టు గోస్వామి అనే కృష్ణ భక్తుడు ఉండేవాడు. ఆయన అనునిత్యం .. అనుక్షణం కృష్ణ నామస్మరణ చేస్తూ ఉండేవాడట. ఆయన భక్తికి మెచ్చిన కృష్ణుడు ప్రత్యక్షమై .. ఒక సాలగ్రామాన్నిచ్చి పూజించమని చెప్పాడు. దానిని పూజిస్తే తనని ఆరాధించిన ఫలితమే దక్కుతుందని అన్నాడు. దాంతో ఆ భక్తుడు నిత్యం ఆ సాలగ్రామానికి ధూప .. దీప నైవేద్యాలు సమర్పిస్తూ ఉండేవాడు. దాంతో అంతా ఆయనను వింతగా చూడసాగారు.
అది గమనించిన గోపాల భట్టు .. ఆ సాలగ్రామానికి స్వామి రూపం వస్తే బాగుండేదని అనుకున్నాడట. అంతే ఆ సాలగ్రామానికి కళ్లు .. చెవులు .. ముక్కు వచ్చేశాయి. దాంతో ఆయన ఎంతటి భక్తుడనేది అందరికీ తెలిసిపోయింది. వైశాఖ పౌర్ణమి రోజున ఆ సాలగ్రామానికి స్వామి రూపం వచ్చిందట. అందువలన ప్రతి ఏడాది ఆ రోజున ఆ సాలగ్రామానికి 100 లీటర్ల పాలతో అభిషేకం చేస్తారట. ఆ దృశ్యం చూసినవాళ్లు ధన్యులవుతారని అక్కడివారు బలంగా చెబుతుంటారు.