అసూయ ద్వేషాలు వదిలిపెట్టదగినవి
కొంతమంది తమ పనులు తాము చేసుకుంటూ ముందుకు వెళుతుంటారు. మరికొంతమంది అలా పనులు చేసుకుంటూ వెళుతున్నవారిని విమర్శిస్తూ వుంటారు. కార్యదీక్షలో వున్నవారు ఇలాంటివారి మాటలను పట్టించుకోకుండా ముందుకు సాగుతుంటారు. అందువలన సహజంగానే విజయాలు చేరువవుతుంటాయి. దాంతో కొంతమందికి అసూయ ఏర్పడుతుంది .. అది ద్వేషానికి దారి తీస్తుంది. ద్వేషం వలన వివేకం కోల్పోవడం జరుగుతుంది. ఫలితంగా సాధకులకు అడ్డంకులు సృష్టించడానికి నానా ప్రయత్నాలు చేయడం మొదలుపెడతారు.
ఈ నేపథ్యంలోనే కొన్ని పాపాలు చేయడానికి కూడా వాళ్లు వెనుకాడరు. ద్వేషం కారణంగా వాళ్లు ఇతరుల గురించే తప్ప తమ గురించి ఆలోచించడం మానేస్తారు. అందువలన తమకంటూ లక్ష్యాలను ఏర్పరచుకోలేరు .. ఏమీ సాధించనూ లేరు. ఇలా ఎవరి ద్వేషం వాళ్ల అభివృద్ధికి అడ్డుగా మారడమే కాకుండా, అనారోగ్యానికి దగ్గర చేస్తుంది .. భగవంతుడి అనుగ్రహానికి దూరం చేస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే అసూయ ద్వేషాలు వుండవో, అక్కడ ఉండటానికే భగవంతుడు ఇష్టపడతాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.