విజయాలనిచ్చే వినాయకుడు
దేవతలు .. మహర్షులు లోక కల్యాణం కోసం పూర్వం ఏ కార్యాన్ని తలపెట్టినా ముందుగా వినాయకుడినే పూజించేవారు. వినాయకుడి అనుగ్రహం వల్లనే ఎలాంటి విఘ్నాలైనా తొలగిపోతాయి. అందుకు నిదర్శనంగా పురాణాల్లో ఎన్నో సంఘటనలు కనిపిస్తాయి. అందువలన ముందుగా వినాయకుడినే పూజించాలనేది మహర్షుల మాట. అదే పద్ధతిని మానవాళి కూడా కొనసాగిస్తూ వస్తోంది. ఎవరు ఎలాంటి కార్యాలను తలపెడుతున్నా ముందుగా వినాయకుడికి చెప్పుకుంటూ వుంటారు. ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడమని ఆయనను ప్రార్ధిస్తుంటారు.
ఇక ఏడాది పొడవునా ఎలాంటి కార్యాలు తలపెట్టినా అవి సఫలీకృతమయ్యేలా చూడమని 'వినాయక చవితి' రోజున ఆయన వ్రతాన్ని ఆచరిస్తుంటారు. పిల్లలు .. పెద్దలు .. పేదలు అనే తారతమ్యాలను వినాయకుడు ఎంత మాత్రం పట్టించుకోడు. పిల్లలు ఆడుతూ పాడుతూ తనకి నమస్కరించినా ఆనందంతో పొంగిపోయే మనసు ఆయనది. ఉన్నంతలో పెట్టిన నైవేద్యాలతోనే సంతోషపడి సంతృప్తి చెందే తత్వం ఆయనది. అలాంటి వినాయకుడిని భక్తిభావంతో పూజించడం వలన శత్రు భయం నశిస్తుంది. ఆటంకాలు తొలగిపోయి తలపెట్టిన కార్యాలు ఫలిస్తాయి. విద్య .. ఉద్యోగం .. వ్యాపారం ఇలా అన్ని విషయాల్లోనూ విజయం దక్కుతుంది. ఆయురారోగ్యాలతో పాటు సిరిసంపదలు సొంతమవుతాయి.