భక్తి .. జ్ఞాన మార్గాలే భగవంతుడికి దగ్గర చేస్తాయి

సాధారణంగా కష్టాలు ఎదురైనప్పుడు .. ఇబ్బందుల్లో పడినప్పుడు .. ఆపదలో చిక్కుకున్నప్పుడు భగవంతుడిని ప్రార్ధించడం జరుగుతూ ఉంటుంది. ఇక అనారోగ్య సమస్యలు .. ఆర్థికపరమైన సమస్యలు ఎదురైనప్పుడు కూడా భగవంతుడిని వేడుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటివాటి బారి నుంచి గట్టెక్కినప్పుడు వాళ్లకి దైవంపై మరింతగా గురి కుదురుతూ ఉంటుంది. అక్కడి నుంచి వాళ్లు ఆధ్యాత్మిక మార్గం వైపు అడుగులు వేయడం మొదలు పెడతారు.

 ఇక మరికొందరు కష్టాలను తొలగించమని కాకుండా .. వాటిని ఎదుర్కునే శక్తిని ఇవ్వమని దైవాన్ని కోరుతుంటారు. ఆధ్యాత్మిక మార్గంలో నడిచే జ్ఞానాన్ని ప్రసాదించమని అడుగుతుంటారు. ఇంకొందరు దైవం నుంచి ఏమీ ఆశించరు .. ఎలాంటి సిరి సంపదలను ఆయన నుంచి కోరుకోరు. భగవంతుడి సన్నిధిలో ఉండటంలో ఆనందం .. ఆయన నామ స్మరణలో సంతోషాన్ని పొందుతుంటారు. భగవంతుడి రూపాన్ని చూస్తూ .. ఆయన లీలావిశేషాలను కీర్తిస్తూ.. ఆయన ఆలోచనల్లోనే అనుక్షణం తరిస్తుంటారు. ఇక వారికి దేనిపై ఆశ ఉండదు ..ధ్యాస ఉండదు .. వ్యామోహమూ ఉండదు. అలాంటి భక్తుల పట్ల భగవంతుడి అనుగ్రహం కూడా ఆ స్థాయిలోనే ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. భక్తి .. జ్ఞాన మార్గాలు భగవంతుడికి దగ్గరగా చేస్తాయని స్పష్టం చేస్తున్నాయి.               


More Bhakti News