కృష్ణా అంటే చాలు కష్టాలు తొలగిపోతాయి
దుష్ట శిక్షణ .. శిష్ట రక్షణ కోసం శ్రీమన్నారాయణుడు అనేక అవతారాలను ధరించాడు. అలాంటి అవతారాలలో కృష్ణావతారమే పూర్ణావతారమని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందుకే ఆ స్వామిని కృష్ణ పరమాత్మగా పిలుస్తుంటారు. అలాంటి కృష్ణ పరమాత్ముడు అవతరించిన దివ్యమైన తిథియే 'కృష్ణాష్టమి'. ఈ పండుగ రోజున ఉదయాన్నే స్నానం చేసి .. షోడశ ఉపచారాలతో శ్రీ కృష్ణుడిని పూజించాలి. ఆ స్వామికి ఇష్టమైన పాలు .. పండ్లు .. వెన్న .. మీగడలు నైవేద్యాలుగా సమర్పించాలి.
పూజ పూర్తయిన తరువాత భాగవతాది గ్రంధాల్లోని శ్రీ కృష్ణుడి లీలా విశేషాలను చదువుకోవాలి. వీలైతే చుట్టుపక్కలవారిని కూడా పిలిచి, వారికి కూడా వినిపించడం వలన మరింత ఆనందం కలుగుతుంది. చిన్నికృష్ణుడి ప్రతిమకి ఉత్సాహంతో ఊరేగింపు జరిపి, ఆ తరువాత ఊయలలో ఉంచి పాటలు పాడటం చేయాలి. ఇలా కృష్ణాష్టమిని అందరితో కలిసి సంతోషంగా .. సంబరంగా జరుపుకోవాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ రోజున కృష్ణుడిని పూజించడం వలన సమస్త పాపాలు నశించి సకల శుభాలు కలుగుతాయనీ, తలపెట్టిన కార్యాల్లో విజయం చేకూరుతుందని స్పష్టం చేస్తున్నాయి.