అసలైన ఆనందం భగవంతుడి సేవలోనే లభిస్తుంది

జీవితం ఎప్పుడూ ఆనందంగా గడిచిపోవాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఈ ఆనందమనేది వాళ్లు ఆశిస్తున్న దానిని బట్టి ఉంటుంది. కొంతమంది తమ సంపదను చూసి ఆనందపడుతుంటారు. మరికొంతమంది తాము సాధిస్తోన్న విజయాలు చూసి పొంగిపోతుంటారు. ఇంకొందరు ఇతరులు తమని అభినందిస్తూ వుంటే మురిసిపోతూ వుంటారు. ఇక కోరుకున్నది దక్కినప్పుడు .. ఖరీదైన కానుకను పొందినప్పుడు ఆనందపడటం జరుగుతూ ఉంటుంది.

 ఇలా ఎవరి పరిథిలో వారు ఒక్కో ఆనందాన్ని పొందుతూ వెళుతుంటారు. అలా కొంత కాలం గడిచాక .. ఎంత సాధించినా ఏదో వెలితిగా అనిపించడం జరుగుతుంది. అలా ఎందుకు అనిపిస్తుందనే ప్రశ్నకి సమాధానం .. భగవంతుడి సేవలో పాల్గొన్నప్పుడు తెలుస్తుంది. అప్పుడు లభించే ఆనందం ముందు అంతకుముందు పొందినవన్నీ చాలా స్వల్పమైనవిగా .. అల్పమైనవిగా అనిపిస్తాయి. అసలైన ఆనందం .. ఆత్మానందమే! అది భగవంతుడి సేవలోనే లభిస్తుందనే విషయం అర్థమవుతుంది .. అది తెలుసుకున్నప్పుడే జీవితం సార్థకమవుతుంది.


More Bhakti News