ఆరోగ్యాన్నిచ్చే సూర్యభగవానుడు
సూర్యభగవానుడిని ప్రత్యక్ష నారాయణుడిగా భావించడం .. అనునిత్యం ఆ స్వామిని పూజించడం ప్రాచీన కాలం నుంచి వుంది. చీకట్లను తొలగిస్తూ .. వెలుగులు ప్రసరింపజేసే సూర్యుడిని దేవతలు .. మహర్షులు అనునిత్యం పూజిస్తుంటారు. "నమస్కార ప్రియో భాను:" అని పెద్దలు చెబుతుంటారు గనుక, ఆ స్వామికి ఉదయాన్నే నమస్కరిస్తూ ఉండటం కూడా ప్రాచీన కాలం నుంచి వస్తోంది.
సూర్యుడు రాకపోతే క్రిమికీటకాలు విజృంభిస్తాయి .. ఫలితంగా వ్యాధులు తీవ్రంగా వ్యాపించడం మొదలవుతుంది. వర్షాలు లేకపోవడం .. పంటలు పండకపోవడం జరుగుతుంది. కరవు కాటకాలు ఏర్పడటంతో ప్రాణకోటి నశిస్తుంది. సమస్త ప్రాణకోటి సూర్యభగవానుడి అనుగ్రహంపైనే ఆధారపడి ఉంటుందనేది ప్రత్యక్షంగా తెలిసిపోతూనే వుంది. అందుకే ఆ స్వామిని అనునిత్యం అంకితభావంతో ఆరాధించాలి.