క్షేత్ర దర్శనం విషయంలో ఆలస్యం చేయకూడదు
భగవంతుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. మహర్షులకిచ్చిన మాట మేరకు .. మహా భక్తుల కోరిక మేరకు ఆయన అనేక ప్రదేశాల్లో కొలువుదీరాడు. ఆ ప్రదేశాలన్నీ కూడా పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. అలాంటి క్షేత్రాలను దర్శించుకోవడం మహా భాగ్యమనే చెప్పాలి. సమయం చిక్కితే చాలు క్షేత్రాలకు బయల్దేరేవాళ్లు కొందరుంటారు. అప్పుడే తొందరేం వుంది .. బరువు బాధ్యతలు తీరని అనుకునేవాళ్లు మరికొందరుంటారు.
కానీ వంట్లో కాస్త ఓపిక వున్నప్పుడే క్షేత్ర దర్శనాలు చేయాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సముద్రంలో అలలు తగ్గిన తరువాత స్నానం చేద్దాంలే అనుకుంటే .. ఒడ్డునే ఎప్పటికీ నుంచుండి పోవాల్సి వస్తుంది. తీరిక లేదు .. చాలా పనులున్నాయి అనుకుంటూ కూర్చోవడం కూడా అలాంటిదే. తీర్థయాత్రలు .. దైవ దర్శనాలు వృద్ధాప్యం వచ్చాక చేసేవి అనే ఆలోచన సరైనది కాదు. ఆరోగ్యంగా వున్నప్పుడే .. తిరగగలిగే శక్తి వున్నప్పుడే ఆయా క్షేత్రాలను దర్శించుకుని రావడమే మంచిది. ఆ తరువాత శరీరం సహకరించకపోయినా .. పశ్చాత్తాపం చెందాల్సిన పనిలేకుండా పోతుంది.