అప్పుకు దూరంగా ఉండటంలోనే ఆనందం వుంది

జీవితమన్నాక కష్టాలు .. నష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని అధిగమిస్తూ అంతా ముందుకు వెళుతూనే వుంటారు. ఈ నేపథ్యంలో కొంతమంది ఆపదలు .. అవసరాల నుంచి గట్టెక్కడం కోసం అప్పు చేస్తుంటారు. మరికొందరు తమ విలాసాల కోసం .. సరదాల కోసం అప్పు చేస్తుంటారు. అవకాశం ఉండాలి గానీ .. ఆపద సమయంలో చేసిన అప్పు తీర్చడానికి ఎక్కువ కాలం పట్టదు. కానీ విలాసాల కోసం .. సుఖాల కోసం చేసే  అప్పు పెరుగుతూ పోతుంటుంది. ఇక అప్పు ఇవ్వడానికి ఎవరూ లేరనేంతవరకూ చేస్తూ వెళ్లడం జరుగుతూ ఉంటుంది.

ఇక అప్పటి నుంచి అప్పు ఇచ్చిన వాళ్ల నుంచి తప్పించుకు తిరగడం మొదలవుతుంది. చేసిన అప్పులు తీర్చలేక .. కొత్తగా ఇచ్చేవాళ్లు ఎవరూ లేకపోవడంతో మనశ్శాంతి దూరమవుతుంది. అశాంతి .. అనారోగ్యాలకు దారితీస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మళ్లీ డబ్బే అవసరమవుతుంది. ఇక ఇప్పుడు అత్యవసరమంటూ అప్పు అడిగినా ఎవరూ ఇవ్వరు. అందుకే ఆపద సమయాల్లో .. అత్యవసరాల్లో తప్ప వీలైనంత వరకూ అప్పు చేయకపోవడమే మంచిది. అప్పు వల్ల ఇంటికి వచ్చేది ఏదీ శాశ్వతమైన సంతోషాన్ని ఇవ్వలేదు .. సంతృప్తిని కలిగించలేదు. అందువల్లనే అప్పుకు దూరంగా ఉండాలి .. సంతృప్తికి దగ్గరగా ఉండాలి ..  మనశ్శాంతితో బ్రతకాలి.    


More Bhakti News